అటు పోలీసోడు, ఇటు బేబీ జాన్.. మధ్యలో ఉస్తాద్!

వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బీ నటించిన 'బేబీ జాన్' సినిమా క్రిస్మస్ స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చింది. అట్లీ తమిళ్ లో తీసిన 'తేరి' మూవీకి హిందీ రీమేక్ ఇది.

Update: 2024-12-30 07:35 GMT

వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బీ నటించిన 'బేబీ జాన్' సినిమా క్రిస్మస్ స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చింది. అట్లీ తమిళ్ లో తీసిన 'తేరి' మూవీకి హిందీ రీమేక్ ఇది. మొదటి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం, లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. 'పుష్ప 2' ముందు నిలబడలేకపోయింది. నాలుగు రోజుల్లో 23 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టడంతో బాక్సాఫీస్ డిజాస్టర్ గా ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. దీంతో ఇప్పుడు అనుకోకుండా 'ఉస్తాద్ భగత్ సింగ్' వార్తల్లోకి వచ్చింది.

పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఉస్తాద్ భగత్ సింగ్". మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది 'తేరి' సినిమాకి రీమేక్ అనే టాక్ ఉంది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ పవన్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు సెట్స్ లోకి వెళ్తారనేది చెప్పలేని పరిస్థితి. వచ్చే ఏడాదిలో పవన్ బల్క్ డేట్స్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు 'బేబీ జాన్' మూవీ ఘోర పరాజయం చవిచూడటంతో, హరీశ్ ఉస్తాద్ ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది.

విజయ్ హీరోగా నటించిన 'తేరి' సినిమాని తెలుగులో 'పోలీసోడు' పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. థియేటర్లలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ, టీవీలోకి వచ్చిన తర్వాత అందరూ బాగా చూశారు. ఇప్పటికీ రెండు వారాలకు ఒకసారి స్టార్ మా ఛానల్స్ లో ఏదొక దాంట్లో వస్తూనే ఉంటుంది. 8 ఏళ్ల క్రితం తమిళ్ లో తేరి హిట్టయినప్పటికీ, ఇప్పుడు కాన్సెప్ట్ పాతది అయిపోయిందని 'బేబీ జాన్' సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి అర్థమవుతోంది. అలాంటిది మరో ఏడాది తర్వాత రాబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎలా ఉంటుందో అని పవన్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

హరీష్ శంకర్ గతంలో పలు రీమేక్స్ తో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ స్టోరీకి తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి, ఫ్రెష్ కంటెంట్ గా బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తాడనే పేరు తెచ్చుకున్నారు. దబాంగ్ ను గబ్బర్ సింగ్ గా, జిగర్తండ మూవీని గడ్డలకొండ గణేష్ గా తీసి సక్సెస్ సాధించారు. అయితే హిందీలో హిట్టయిన రైడ్ రీమేక్ గా ఆయన తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. హరీశ్ చేసిన మార్పులు చేర్పులు ఈసారి పనిచేయలేదు.

ఓవైపు 'మిస్టర్ బచ్చన్' డిజాస్టర్ గా మారడం, మరోవైపు 'బేబీ జాన్' డిజాస్టర్ గా పయనిస్తుండటం కచ్ఛితంగా హరీష్ శంకర్ మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఒకరంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' దర్శకుడికి అగ్ని పరీక్ష అని చెప్పాలి. రెండు సినిమాలతో పోలికలు పెట్టి చూస్తారు. వాటికి భిన్నమైన కంటెంట్ తో వస్తేనే జనాలు ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో హరీష్ తేరి లైన్ మాత్రమే తీసుకొని, కీలకమైన మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ తరహాలోనే స్క్రిప్టులో ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేశారనే టాక్ ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. మరి తప్పకుండా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో హరీశ్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి

Tags:    

Similar News