అంబానీ పెళ్లిలో జనసేనాని స్పెషల్ ఎట్రాక్షన్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు, బిలియనీర్లు ఎటెండయిన సంగతి తెలిసిందే
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు, బిలియనీర్లు ఎటెండయిన సంగతి తెలిసిందే. ఈనెల 12న జియో సెంటర్‌లో జరిగిన విలాసవంతమైన పెళ్లి వేడుక కోసం బాలీవుడ్ సహా అన్ని సినీపరిశ్రమల నుంచి ప్రముఖులు ఎటెండయ్యారు. నేటి శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్లారు. అనంత్ అంబానీ వివాహ శుభ్ ఆశీర్వాద్ వేడుకలో ముఖేష్ అంబానీ- అనీల్ అంబానీ సోదరులు ఎంతో ఆప్యాయంగా పవన్ ని ఆహ్వానిస్తూ ప్రేమగా పలకరిస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఆ సమయంలో పవన్ కల్యాణ్ తో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈవెంట్లో ఉన్నారు. అలాగే ఈ వేడుకలో మున్నాభాయ్ సంజయ్ దత్ ఎంతో ఆప్యాయంగా పవన్ ని ఆలింగనం చేసుకున్న ఫోటోలు నెట్ లోకి వచ్చాయి.
పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి వేడుకలో పంచె కట్టుతో ఎంతో ప్రత్యేకంగా కనిపించారు. ఆయన ఆధ్యాత్మిక శైలి కారణంగా గుంపులో యూనిక్ నెస్ హైలైట్ అయింది. జనసేనాని తనదైన మార్క్ చిరునవ్వులతో వేడుకలో పెద్దలందరినీ కలుస్తున్న విధానం ఆకర్షించింది. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కి దక్కిన గౌరవం ప్రత్యేకంగా అభిమానులను ఆకర్షిస్తోంది. అంబానీల పెళ్లి నుంచి విడుదలవుతున్న పవన్ ఫోటోలు అంతర్జాలంలో సునామీలా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ వీటిని విరివిగా షేర్ చేస్తున్నారు.
ఈ వివాహానికి కోలీవుడ్ నుంచి రజనీకాంత్, టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ వేడుకలకు సినీ రాజకీయ రంగ నిపుణులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, క్రీడారంగ ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచంలోనే మేటి అనదగ్గ పాప్ స్టార్లు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం ఏకంగా 5000 కోట్లు (సంపదలో 0.5 శాతం) ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది.