పొంగల్ లో తమిళ పోరు తప్పేలా లేదు
మహేశ్ బాబు గుంటూరుకారం, నాగార్జున నా సామి రంగా, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ మూవీలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయి.
తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు కీలకమైన పండుగ సంక్రాంతి. అందుకే పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా అందరూ ఈ ఫెస్టివల్ కే తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరు, బాలయ్య, అజిత్, దళపతి విజయ్ సినిమాలు పోటీ పడ్డాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమాలే ఏకంగా ఐదు పోటీలో ఉన్నాయి.
మహేశ్ బాబు గుంటూరుకారం, నాగార్జున నా సామి రంగా, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ మూవీలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ, ఈ చిత్రాలకు థియేటర్లు కేటాయించడంలోనే సమస్య ఎదురైంది.
బయటకు ఈ సినిమాల కోసం థియేటర్లు మాట్లాడుకున్నామని, అగ్రిమెంట్లు కూడా చేసేసుకున్నామని మేకర్స్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి బిగ్ బాస్ లో నాగార్జున అన్నట్లు ఉల్టా పల్టాగా ఉందట. మహేశ్ బాబు, వెంకటేశ్ సినిమాల చిత్రయూనిట్ లు మాత్రమే థియేటర్ల విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నారట. ఆ రెండు చిత్రబృందాలకు మూవీ బయ్యర్లు కూడ సహకరిస్తున్నారట.
మరోవైపు, నాగార్జున నా సామిరంగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఈ సినిమా థియేటర్ల విషయం తేలాల్సి ఉంది. తేజ హనుమాన్, రవితేజ ఈగల్ మేకర్స్ కూడా తమకు సరిపడా థియేటర్లు ఉన్నాయని చెబుతున్నాట్లు తెలుస్తోంది. వాటితోనే అడ్జస్ట్ అవుతామని అంటున్నారట. సంక్రాంతి బరిలో దిగనున్న తెలుగు సినిమాల పరిస్థితి ఇది.
అయితే సంక్రాంతి రేసులో ఈ ఐదు సినిమాలు కాకుండా మరో మూడు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అవి కూడా చిన్నహీరోలవి కాదు.. టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోలవే.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్, ధనుశ్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలన్ మూవీలు కూడా సంక్రాంతి రోజుల్లోనే విడుదలవుతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలకు తెలుగు డిస్ట్రిబ్యూటర్లెవరో ఇప్పుడిప్పుడే చెప్పలేం. కానీ పెద్ద సినిమాలు కనుక ఎవరో ఒకరు కొనేసి ఎన్నో కొన్ని స్క్రీన్లలో వేస్తారు. మరి వీటికి థియేటర్లు ఎలా సెట్ చేస్తారనేది అసలు ప్రశ్న..
మామూలుగా ఏటా సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైనా పెద్దగా థియేటర్ల సమస్య వచ్చేది కాదు. తెలుగు చిత్రాలకు సరిపడా స్క్రీన్లు లభించేవి. కానీ ఈసారి మాత్రం ఒకేసారి ఎనిమిది సినిమాలకు థియేటర్లు కేటాయించాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే ఎవరూ తగ్గడం లేదు. ఒకవేళ నిజంగానే ఆ సినిమాలన్నీ అనుకున్న సమయానికే రావాలని చూస్తే థియేటర్లు సర్దుబాటు చేయడం సినీ ప్రముఖులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలా అని తమిళనాడులోలాగా డబ్బింగ్ చిత్రాలు తర్వాత రిలీజ్ చేసుకోమని అడగుదామంటే.. ఓటీటీ సంస్థలు ఒప్పుకోవు. మొత్తానికి పెద్ద సమస్య వచ్చే పడింది. మరేం జరుగుతుందో చూడాలి.