పూజ.. వారి వల్ల గట్టి దెబ్బే!

హీరోయిన్ పూజ హెగ్డే.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలిన ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త సైలెంట్ అయిన విషయం తెలిసిందే. మళ్లీ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు పొడుగు కాళ్ల సుందరి.

Update: 2024-12-12 14:30 GMT

హీరోయిన్ పూజ హెగ్డే.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలిన ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త సైలెంట్ అయిన విషయం తెలిసిందే. మళ్లీ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు పొడుగు కాళ్ల సుందరి. యంగ్ హీరో నాగచైతన్య ఒక లైలా కోసం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుందలో యాక్ట్ చేశారు. ఆ రెండు మూవీస్ పెద్దగా హిట్ కాకపోయినా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అనంతరం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ అందుకున్నారు. కానీ అనుకున్నస్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయారు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో హరీష్ శంకర్ తెరకెక్కించిన దువ్వాడ జగన్నాథం మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. వరుస ఛాన్సులు అందుకున్నారు. మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో మంచి హిట్స్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు పూజ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. అవన్నీ ఫ్లాపులు అయ్యాయి. అనంతరం వివిధ ఛాన్సులు వచ్చినా ఆమె వదులుకున్నారు.

గుంటూరు కారంలో పూజను హీరోయిన్ గా తీసుకున్నా.. ఆమె తప్పుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు కూడా పూజనే ఎంపిక చేయగా ఆమె నో చెప్పారు. దీంతో ఆ రెండు సినిమాల్లో యంగ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నారు ఆయా మేకర్స్. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, బాలీవుడ్ లో రెండు మూవీలు చేస్తున్నారు పూజా హెగ్డే. హెచ్. వినోథ్ దర్శకత్వం వహిస్తున్న దళపతి విజయ్ 69లో యాక్ట్ చేస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న సూర్య 44లో నటిస్తున్నారు. బీటౌన్ లో హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై తోపాటు దేవా చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. 2025లో వరుస ప్రాజెక్టులతో సందడి చేయనున్నారు పూజ హెగ్డే. అయితే పూజ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పుడు లేనట్లు తెలుస్తోంది. పలు వార్తలు వస్తున్నా.. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావడం లేదు. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న మూవీలో పూజనే హీరోయిన్ గా తీసుకున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపించింది. ఇప్పుడు ఆమె బదులు శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పూజకు మరో తెలుగు ఆఫర్ మిస్ అయిందన్నమాట.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ ను పూజ ఏలినా.. ఇప్పుడు ఆమెకు పలు హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో పూజ అనుకున్న స్థాయిలో ఛాన్సులు అందుకోలేకపోతున్నారు అంటున్నారు. శ్రీలీల, రష్మిక, సాయి పల్లవి సూపర్ ఫామ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.

నిజానికి శ్రీలీలకు వరుస ఫ్లాపులు వచ్చినా ఆమె క్రేజ్ అస్సలు తగ్గలేదు. మంచి అవకాశాలు అందుకుని బిజీగా గడుపుతున్నారు. కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా ఏలేలా కనిపిస్తున్నారు. రష్మిక మందన్న గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్ టు సౌత్ అనేక సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా పుష్ప సీక్వెల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరిన్ని సినిమాలతో త్వరలో సందడి చేయనున్నారు. ఇక సాయి పల్లవి.. రీసెంట్ గా అమరన్ తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. డీగ్లామర్ రోల్ లో సందడి చేయనున్నారు. బాలీవుడ్ రామాయణలో యాక్ట్ చేస్తున్నారు. వాటితోపాటు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. వీరు ముగ్గురు మంచి ఫామ్ లో ఉండడం వల్ల పూజకు డిమాండ్ బాగా తగ్గిందనే చెప్పాలి. దీంతో ఆమెకు తెలుగులో సరైన ఛాన్సులు రావడం లేదు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ క్లిక్ అయితే ఆమె కూడా ఫామ్ లోకి వచ్చేసి పోటీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చి తెలుగులో అదిరిపోయే ప్రాజెక్టుల్లో పూజా హెగ్డే నటించాలని సోషల్ మీడియాలో వేదికగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది. తమ టాలెంట్ ను నిరూపించుకుని ముద్దుగుమ్మలు ముందుకు వెళ్లాలి. పోటీ తత్వంతో సత్తా చాటి హిట్స్ అందుకోవాలి. తద్వారా సరైన ఛాన్సులు దక్కించుకోవాలి. మరి పూజా తన అప్ కమింగ్ మూవీస్ విషయంలో ఏం చేస్తారో.. ఎలాంటి ఛాన్సులు అందుకుంటారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News