సెలబ్రిటీలు వివిధ వ్యాపారాల్లో భారీ పెట్టుబడులు పెడుతుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ లోనూ టాప్ సెలబ్రిటీలంతా కొనసాగుతున్నారు. అందులోనూ బాలీవుడ్ నటులు ఎక్కువగా ఈ జాబితాలో కనిపిస్తుంటారు. రియల్ వెంచర్ల పేరుతో కోట్ల రూపాయల బిజినెస్ ముంబై అడ్డాగా జరుగుతోంది. అయితే అప్పుడప్పుడు కోర్టులో వివాదాలు ఎదుర్కుంటారు. క్రయవిక్రయాల విషయంలో కోర్టు మెట్లు ఎక్కిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ నటి పూజాభట్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓ భూమికి సబంధించిన వివాదంలో కోర్ట్ నుంచి పూజాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే చాలా కాలం క్రితం నీలగిరి జిల్లా జెగదల గ్రామంలో పూజా భట్ ఓ భూమిని కొనుగోలు చేశారు. కానీ అది అసైన్డ్ భూమి అని తర్వాత తేలింది. దీంతో ఆ ల్యాండ్ పై వివాదం నెలకొంది. ఆ భూమి ఎస్టీ తెగకు చెందిన ఎం.కుప్పన్ అనే వ్యక్తికి 1978లో అప్పటి జిల్లా కలెక్టర్ కేటాయించారుట. ఈ భూమి ఒక ఎకరం వరకూ ఉంటుందిట. కాలక్రమంలో ఆ భూమి పలువురి చేతులు మారింది.
ఇదే సమయంలో పూజాభట్ ఆ భూమిని కొన్నారు. అయితే ఈ భూమి కొనుగోలు చెల్లదని..ప్రభుత్వానికి అప్పగించాలని గతంలోనే తాహశీల్దారు ఆదేశించారు. దీంతో పూజాభట్ న్యాయపోరాటానికి దిగింది. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై పలు ధపాలు విచారణ జరిగింది. తాజాగా హైకోర్టు జడ్జి తహశీల్దారు ఆదేశాలను అంగీకరిస్తూ తుది తీర్పును వెలువరించారు.
దీంతో ఆ ల్యాండ్ ప్రభుత్వ వశమైంది. ఈ తీర్పుపై పూజాభట్ ఇంకా స్పందించలేదు. ఈ విషయంలో ఇంకా న్యాయ పోరాటం కొనసాగిస్తుందా? సుప్రీం కోర్డ్ కు వెళ్తుందా? లేక భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తుందా? అన్నది వేచి చూడాలి. పూజా భట్ బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.