పూనమ్ పాండే చేసింది తప్పా? రైటా?
ఇక.. రేపు (ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. అలాంటి సమయంలో మంచి కోణంలో అవగాహన కల్పించకుండా.. ఫేక్ వీడియోతో ఇలా చేయడం అస్సలు బాలేదని అంటున్నారు.
పూనమ్ పాండే.. గత రెండు రోజులుగా నెట్టింట ఇదే పేరు ట్రెండింగ్. సర్వైకల్ క్యాన్సర్ తో పూనమ్ మరణించిందని నిన్న ఆమె సన్నిహితులు ప్రకటించడంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ అందరూ ఫొటోలు షేర్ చేశారు. అస్సలు నమ్మలేకపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఒకవేళ క్యాన్సర్ బారినపడ్డా.. మొన్నటి వరకు బాగానే ఉండి సడెన్ గా చనిపోవడమేంటని అనుమానపడ్డారు. నిజంగా అసలు ఆమె చనిపోయిందా లేదా అని ప్రశ్నించారు.
ఇంతలో పూనమ్.. మళ్లీ షాకింగ్ గా ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది. తాను చనిపోలేదని, బతికే ఉన్నట్లు చెప్పింది. తనకు ఎలాంటి క్యాన్సర్ సోకలేదని, కేవలం సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కోసమే ఇలా చేశానని తెలిపింది. ఆ వ్యాధి పట్ల అవగాహన లేక అనేక మంది మహిళలు చనిపోతున్నారని చెప్పింది. గర్భాశయ క్యాన్సర్ విషయంలో చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దామని తెలిపింది. కానీ పూనమ్ చేసిన ఈ అవేర్నెస్ వీడియోపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.
పూనమ్ పాండే చేయాలనుకున్న కార్యక్రమం మంచిదే అయినా.. చేసిన విధానం అస్సలు బాగోలేదని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే.. ప్రజలకు ఉన్న అనుమానాలను సోషల్ మీడియా వేదిక గా క్లియర్ చేయాలని, లేకుంటే ప్రజల మధ్యకు వెళ్లి వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. అంతే గానీ.. ఇలా చనిపోయానని ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తే ఇప్పటికే ఆ వ్యాధి బారినపడ్డ వారు తాము కూడా చనిపోతామేమోనని భయపడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక.. రేపు (ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. అలాంటి సమయంలో మంచి కోణంలో అవగాహన కల్పించకుండా.. ఫేక్ వీడియోతో ఇలా చేయడం అస్సలు బాలేదని అంటున్నారు. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ.. చెడు చేయడం చాలా తప్పని హితవు పలుకుతున్నారు. ఇక ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి వీడియోలతో ఎవరినీ భయపెట్టొద్దని కోరుతున్నారు.
ఇటీవలే.. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెడతామని ప్రకటించారు. ఆ తర్వాత రోజే అంటే ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ తో పూనమ్ మృతి అంటూ వార్త బయటకొచ్చి హల్ చల్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది.