ఆయన సినిమాల్లో చేయడం అదృష్టం : ప్రభాస్
ఈ డాక్యుమెంటరీ లో రాజమౌళి కి సంబందించిన పలు విషయాలను చూపించడం జరిగింది.
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ ప్రేక్షకులకు అన్ని విషయాలు తెలుసు. అయినా కూడా ఆయనలోని కొత్త యాంగిల్స్ ను, ఆయన విజయాల వెనుక ఉన్న రహస్యం ఇలా పలు విషయాలను తెలియజేసేందుకు గాను నెట్ ఫ్లిక్స్ 'మోడ్రన్ మాస్టర్స్' అనే డాక్యుమెంటరీని తీసుకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ లో రాజమౌళి కి సంబందించిన పలు విషయాలను చూపించడం జరిగింది.
ప్రముఖ జర్నలిస్ట్ కమ్ యాంకర్ అయిన అనుపమా చోప్రా ఈ డాక్యుమెంటరీని నిర్మించగా రాఘవ్ కన్నా మరియు తన్వి లు దర్శకత్వం వహించారు. ఎక్కడ బోర్ కొట్టకుండా రాజమౌళి గొప్పతనాలు, విజయాలు చెబుతూనే ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి కూడా చెప్పడం ద్వారా డాక్యుమెంటరీకి నిండుతనం దక్కింది. డాక్యుమెంటరీలో రాజమౌళి 'నా కథకు నేను బానిసను, నా ప్రేక్షకుల విషయంలో నేను అత్యాశపరుడిని... నా కథను ఎక్కువ మంది చూడాలి' అని కోరుకునే సగటు దర్శకుడిని అంటూ చెప్పిన విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
దర్శకుడిగా అవకాశం రాక ముందు రాజమౌళి ఏం చేశాడు, దర్శకుడిగా అవకాశం రావడంకు ఏం చేశాడు అనే విషయాలను కూడా ఇందులో ప్రస్థావించడం జరిగింది. కెరీర్ ఆరంభించక ముందు నుంచి కూడా తన జీవితంలో, తన కుటుంబం వెనుక ఉండి నడిపించిన వ్యక్తుల గురించి కూడా రాజమౌళి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయంలో దర్శకుడిగా ఎదుర్కొన్న పరిస్థితులు మొదలుకుని మొన్నటి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సమయంలో తన మానసిక పరిస్థితి వరకు అన్ని విషయాలను అద్భుతంగా చెప్పాడు.
రాజమౌళి గురించి ఎన్టీఆర్, ప్రభాస్ లతో పాటు పలువురు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ... రాజమౌళికి కావాలి అనుకున్నట్లుగా మనం మారితే ఆయనే మనలను తనకు కావాల్సినట్లుగా మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తాడు అన్నాడు. ప్రభాస్ మాట్లాడుతూ... సినిమా అంటే రాజమౌళికి పిచ్చి. షూటింగ్ సమయంలో సీన్ ను ఎవరైనా వినిపిస్తారు. కానీ రాజమౌళి మాత్రమే ముందు తాను నటించి, ఆ తర్వాత మనతో నటింపజేస్తాడు. అలాంటి దర్శకుడితో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తాను అన్నాడు.
డాక్యుమెంటరీ మొత్తం కూడా రాజమౌళి మాట్లాడటంతో పాటు ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు, ఇంటర్వ్యూలు కొన్ని సినిమాల క్లిప్స్ తో సాగింది. రాజమౌళి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... రాజమౌళికి రాముడి కంటే కూడా రావణుడు ఎక్కువ ఇష్టం. అందుకే సినిమాల్లో హీరోల కంటే విలన్స్ ను ఎక్కువ బలవంతులుగా చూపిస్తారు. అయితే చివరికి మాత్రం హీరో గెలిచే విధంగా ఆయన స్క్రీన్ ప్లే ఉంటుందని వారు అన్నారు.
రాజమౌళి గురించి రూపొందిన ఈ డాక్యుమెంటరీ గంట.. గంటన్నర కాకుండా దాదాపుగా రెండు గంటల నిడివితో సాగింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ ని ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు మరియు ఫిల్మ్ మేకర్స్ చూసే విధంగా ఇంగ్లీష్ భాష లో ఉంచారు. ఇతర భాషల్లో కూడా డబ్ చేశారు. తెలుగు లో కూడా రాజమౌళి వాయిస్ తో కాకుండా డబ్బింగ్ చెప్పారు. తెలుగు లో రాజమౌళి డైరెక్ట్ వాయిస్ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కొందరు అయినా వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ వెబ్ సిరీస్ ను తెలుగు లో కంటే డైరెక్ట్ ఇంగ్లీష్ లో చూస్తే బాగుంటుంది.