'రాజా సాబ్' డైరెక్టర్ చాలా లక్కీ!
టాలీవుడ్ హీరో ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు
టాలీవుడ్ హీరో ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'బాహుబలి 2' తర్వాత వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన రెబల్ స్టార్ రెండో సినిమా ఇది. ఎస్.ఎస్ రాజమౌళి సపోర్ట్ లేకుండానే ఇలాంటి మైలురాయి మార్క్ ను క్రాస్ చేసి రియల్ పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్నారు ప్రభాస్. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలపై అందరి దృష్టి పడింది.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' సినిమాలో నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చిత్రాన్ని ప్రకటించారు. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్ లో మూవీ చేయడానికి గ్రీన్ సింగ్నల్ ఇచ్చారు. వీటితో పాటుగా 'సలార్ 2' 'కల్కి 2' చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. వీటిల్లో సెట్స్ మీదున్న రాజా సాబ్ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఓ రకంగా మారుతికి ప్లస్ అయితే, మరో రకంగా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చే విషయమే.
'కల్కి' తర్వాత సహజంగానే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో భారీ అంచనాలు ఉంటాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ రికార్డుని కంటిన్యూ చెయ్యాలని అభిమానులు కోరుకుంటారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ప్రభాస్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మారుతీ 'ది రాజా సాబ్' మూవీతో అందరినీ సంతృప్తి పరచాల్సి ఉంటుంది. ప్రభాస్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కంటెంట్ ను అందించాలి. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా డార్లింగ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తారు. ఈ విధంగా చూస్తే దర్శకుడిపై అధిక ఒత్తిడి ఉంటుందనే అనుకోవాలి.
మారుతి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా 'ది రాజా సాబ్'. కానీ ప్రభాస్ సైడ్ నుంచి చూసుకుంటే, ఈ మధ్య కాలంలో ఆయన్నుంచి వస్తున్న లో బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు 'సలార్' 'కల్కి 2898 ఏడీ' వంటి భారీ విజయాల తర్వాత 'రాజా సాబ్' కు ట్రేడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. పెట్టిన పెట్టుబడికి ప్రీ-రిలీజ్ బిజినెస్ కు అసలు సంబంధమే లేదన్నట్టుగా డీల్స్ వస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఇదంతా డైరెక్టర్ మారుతి కెరీర్ కు హెల్ప్ అవుతుంది. సినిమా హిట్టయితే ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తే దర్శకుడు చాలా లక్కీ అనే చెప్పాలి.
నిజానికి మారుతితో ప్రభాస్ 'రాజా సాబ్' సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చినప్పుడే సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. భారీ చిత్రాల మధ్యలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎందుకని ఫ్యాన్స్ ప్రభాస్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి వరకూ మీడియం రేంజ్ హీరోలను మాత్రమే హ్యాండిల్ చేసిన దర్శకుడు.. బాహుబలి హీరోని ఎలా హ్యాండిల్ చేస్తాడని వ్యాఖ్యానించారు. ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకోమని ప్రభాస్ కు విన్నవించుకోవడమే కాదు, మారుతిని తెగ ట్రోల్ చేసారు. అయితే ఫస్ట్ లుక్ తో అందరి నోళ్లు మూయించారు మారుతి.
'ది రాజా సాబ్' లో గుబురు గడ్డంతో, లాంగ్ హెయిర్ తో పంచెకట్టుతో ప్రభాస్ ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేసారు. ఇటీవల కాలంలో అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్న ప్రభాస్ ను చాలా జోవియల్ పాత్రలో చూపించబోతున్నట్లు హామీ ఇచ్చారు. సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందనే ఆసక్తిని రేకెత్తించారు. ఇప్పటికైతే ఇదొక హారర్ కామెడీ థ్రిల్లర్ అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది.