ప్రశాంత్ నెక్స్ట్ మూవీ.. మూడింటిలో ఏది ఫస్ట్?
ప్రశాంత్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో ఇది పేరు కాదు ఒక బ్రాండ్. థియేటర్లలో విడుదల చేసింది నాలుగే నాలుగు సినిమాలు
ప్రశాంత్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో ఇది పేరు కాదు ఒక బ్రాండ్. థియేటర్లలో విడుదల చేసింది నాలుగే నాలుగు సినిమాలు. కానీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. యువ కథానాయకుడు తేజ సజ్జా లీడ్ రోల్ లో హనుమాన్ మూవీ తెరకెక్కించి తన క్రేజ్ ను ఓ రేంజ్ లో పెంచుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.
మేకర్స్ తోపాటు బయర్స్ కు లాభాల పంట పండించిన ఈ సినిమా.. ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. థియేటర్ లో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రావడం బహుశా ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమంతుడి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ.. డిజిటల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ కొత్త చిత్రాలపై అందరి దృష్టి పడింది.
హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జనవరిలో అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ చేశారు ప్రశాంత్ వర్మ. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. సీక్వెల్ లో హనుమంతుడిదే మెయిన్ రోల్ అని, అందుకోసం ఓ స్టార్ హీరోను ఎంచుకోనున్నట్లు ఇప్పటికే పలుమార్లు చెప్పారు ప్రశాంత్ వర్మ.
ఇప్పుడు తాను నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్ లోని మెయిన్ రోల్ కోసం ఇంకా ఎవరినీ సెలెక్ట్ చేయలేదట. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు.. ఆక్టోపస్ మూవీ వైపు మళ్లిందట. ఈ సినిమా కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65 శాతం పూర్తయింది. దీంతో ఈ మూవీని 2024లో రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. అయితే కొన్ని రోజుల క్రితం.. మరో సూపర్ హీరో మూవీని కూడా అనౌన్స్ చేశారాయన. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా డెబ్యూ మూవీ అధీరను ప్రకటించారు. గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసి 2024లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తనకు ఉన్న లైటింగ్ పవర్ తో ఆ సూపర్ హీరో ఏం చేశారన్నది అధీర కథ. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఏదేమైనా హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాలపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఓ వైపు అధీర, మరోవైపు జై హనుమాన్, ఇంకోవైపు ఆక్టోపస్.. మరి వీటిలో ఏ సినిమాను ప్రశాంత్ వర్మ ముందు రిలీజ్ చేయనున్నారో చూడాలి.