ఫ్రెగ్నెన్సీ అంత సులభమైన విషయం కాదు: రాధిక ఆప్టే
ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి అయిన రాధిక ఆప్టే కూడా గర్భధారణ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి, మార్పుల గురించి మాట్లాడారు.
గర్భధారణ సమయంలో ఎదురయ్యే శారీరక మార్పులు, సవాళ్ల గురించి చాలామంది కథానాయికలు గతంలో మాట్లాడారు. సమీరారెడ్డి, అనుష్క శర్మ, దీపిక పదుకొనే, ఇలియానా, కాజల్ అగర్వాల్ .. వీరంతా ఫ్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న కొన్ని సవాళ్ల గురించి, విభిన్నమైన అనుభూతుల గురించి కూడా మాట్లాడారు. వారి ఫ్రెగ్నెన్సీ జర్నీలో క్లిష్ఠ విషయాలను కూడా ప్రస్థావించారు. గర్భధారణ, ప్రసవంపై చాలా విషయాలను వెల్లడిస్తూ.. బెబో కరీనా కపూర్ ఖాన్ 'ఫ్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు.
ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి అయిన రాధిక ఆప్టే కూడా గర్భధారణ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి, మార్పుల గురించి మాట్లాడారు. తన భర్త బెనెడిక్ట్ ఫ్రెగ్నెన్సీ సమయంలో తనకు ఎంతో అండగా నిలిచారని, ప్రతిదీ అర్థం చేసుకున్నారని కూడా తెలిపారు. నిజానికి పిల్లల గురించి ముందుగా ఏదీ ప్లాన్ చేసుకోలేదని, అకస్మాత్తుగా గర్భం దాల్చానని తెలిశాక షాకయ్యానని రాధిక ఆప్టే వెల్లడించారు. ''డెలివరీకి వారం ముందు ఫోటోషూట్ లో పాల్గొన్నాను. అప్పటికి బాగా లావెక్కాను. ఆ విధంగా నన్ను నేను చూసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. నిద్ర సరిగా లేదు. శరీరం నా అదుపులో లేదు. తల్లినయ్యాక శరీరం అంతా మారిపోయింది.. కొత్త సవాళ్లతో నాలో భిన్న ధృక్పథం ఏర్పడింది. ఈ మార్పుల్లో కూడా నాకొక అందం ఆనందం కనిపించింద''ని రాధిక ఆప్టే అన్నారు. గర్భధారణకు సంబంధించిన ఫోటోలు భవిష్యత్ లో చూసినప్పుడు కూడా ఆనందం కలుగుతుందని ఆప్టే అన్నారు.
ఫ్రెగ్నెన్సీ అనేది అంత సులభమైన విషయం కాదు. అది కఠినమైన సమయం. మానసికంగాను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, నా భర్త నుంచి పూర్తి సహకారం అందింది. దీంతో అన్ని ఒత్తిళ్లను అధిగమించగలిగానని రాధిక ఆప్టే వెల్లడించారు.