చెల్లి పెళ్లికి ప్రియాంక చోప్రా డుమ్మాపై ఆరాలు

బాలీవుడ్ అందాల క‌థానాయిక ప‌రిణీతి చోప్రా పెళ్లికి త‌న సోద‌రి ప్రియాంక చోప్రా డుమ్మా కొడుతోందా? అంటే అవున‌నే మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

Update: 2023-09-23 09:11 GMT

బాలీవుడ్ అందాల క‌థానాయిక ప‌రిణీతి చోప్రా పెళ్లికి త‌న సోద‌రి ప్రియాంక చోప్రా డుమ్మా కొడుతోందా? అంటే అవున‌నే మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. నేటి పెళ్లి వేడుక‌లో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జోడీ సంద‌డి పెద్ద ఎత్తున ఉంటుంద‌ని ఊహించిన వారికి ఇది షాకింగ్ వార్త‌. నిజానికి ప్రియానిక్ పెళ్లిలో పారీ సంద‌డి అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు త‌న చిట్టి చెల్లెమ్మ ప‌రిణీతి పెళ్లిలో పీసీ త‌ప్ప‌క వాలిపోతుంద‌ని, బోలెడంత హంగామా సృష్టిస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఇంత‌లోనే ఇది ఊహించ‌ని ఝ‌ల‌క్.

ప్రియాంక చోప్రా జోనాస్ తన కజిన్ సోదరి పరిణీతి చోప్రా- ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాల బిగ్ డే సందర్భంగా చాలా సింపుల్ గా శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టా వేదిక‌గా పరిణీతి ఒక అంద‌మైన ఫోటోను పోస్ట్ చేసి ఇలా రాసింది. ``మీ బిగ్ డే మీరు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను`` అని పీసీ వ్యాఖ్యానించింది. ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని బ‌ట్టి ప్రియాంక ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నందున తన చెల్లెలు ప‌రిణీతి పెళ్లికి రావ‌డం లేద‌ని ఊహిస్తున్నారు.

సెప్టెంబరు 24న పరిణీతి, రాఘవ్‌ల వివాహం జరగనుంది. ఉదయపూర్‌- లీలా ప్యాలెస్‌లోని తాజ్ లేక్‌లో వివాహ వేడుకకు ఒక రోజు ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమ‌య్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు జరిగిన పరిణీతి చూర పండుగ‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12-4 గంటలకు స్వాగతం కార్య‌క్ర‌మం... కుటుంబీకులు, అలాగే వధూవరులు కూడా రాత్రి 7 గంటలకు పార్టీలో సంద‌డి చేస్తారు. `లెట్స్ పార్టీ లైక్ ఇట్స్ 90` అనే థీమ్‌పై ఈ పార్టీ క‌న్న‌ల పండుగ‌గా సాగ‌నుంది. సెప్టెంబరు 24న అస‌లైన పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4.00 గంటలకు అతిథుల‌తో కుటుంబీకుల‌తో సంద‌డిగా సెల‌బ్రేష‌న్స్ జరుగుతాయి. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు పెళ్లి జరుగుతుంది. లీలా ప్యాలెస్ ప్రాంగణంలో రిసెప్షన్ గాలా 8.30 గంటలకు ఉంటుంది. పీసీ అమెరికా నుంచి రాలేక‌నే ఆగిపోయిందా? లేక ఇంకేవైనా బ‌ల‌మైన కార‌ణాలున్నాయా? అంటూ ఇప్పుడు ఆరాలు మొద‌ల‌య్యాయి.

అతిథుల‌కు స్ట్రిక్ట్ రూల్స్:

రేపు సెప్టెంబర్ 24న రాఘవ్ చద్దా - పరిణీతి చోప్రాల వివాహానికి ఉద‌య్‌పూర్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాఘవ్ - పరిణీతి ధోల్ దరువుల సంద‌డి న‌డుమ‌ నిన్న ఉదయపూర్ చేరుకున్నారు. ప్రస్తుతం వీరి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా హాజరు కానున్నారు. ఈ రాయల్ వెడ్డింగ్‌లో 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించారు. హోటల్ లీలా ప్యాలెస్ పిచోలా సరస్సు మధ్యలో ఉంది. కాబట్టి సరస్సు మధ్యలో నాలుగైదు బోట్లలో సెక్యూరిటీ గార్డులను మోహరించనున్నారు. ఇక్కడి జెట్టీ (బోటు వరకు నిర్మించిన ప్లాట్‌ఫాం) వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అంతే కాదు పెళ్లిలో కూడా కట్టుదిట్టమైన భద్రతా నియమాలు ఉంటాయి. వివాహానికి హాజరయ్యే ఎవరైనా పూర్తిగా స్కాన్ చేయబడతారు. అంతే కాదు ఈ మూడు రోజుల పాటు సిబ్బంది ఎవరూ ప్రాంగణం నుండి బయటకు రాకూడదు. వెన్యూ లోనే ఉంటారు.

వివాహ సన్నాహాలతో పాటు ఈవెంట్ ఫోటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా ప్రత్యేక సన్నాహాలు చేసినట్లు హోటల్ వర్గాలు తెలిపాయి. హోటల్‌లోకి ప్రవేశించే వారి మొబైల్ కెమెరాలకు బ్లూ కలర్ టేప్ అతికిస్తున్నారు. తద్వారా వారు వివాహ వేడుకలో ఎటువంటి వీడియో-ఫోటోగ్రాఫ్ తీసుకోలేరు. ఈ బ్లూ టేప్‌లోని విశేషమేమిటంటే.. ఒక్కసారి మొబైల్ కెమెరాలో అప్లై చేసిన తర్వాత ఎవరైనా దాన్ని తొలగిస్తే టేప్‌పై బాణం గుర్తు కనిపిస్తుంది. దీంతో సెక్యురిటీ తనిఖీ చేయగా కెమెరాను వినియోగించేందుకు టేపును తొలగించినట్లు తెలిసిపోతుంది. ఈ పరిమితి ముఖ్యంగా హోటల్ సిబ్బందితో పాటు టెంట్లు, అలంకరణలు, సౌండ్ సిస్టమ్‌లు, చెఫ్‌లకు వర్తిస్తుంది. కరణ్ జోహార్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖులు పెళ్లి కోసం ఈరోజు ఉదయ్‌పూర్‌కు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి.

Tags:    

Similar News