ముంబైకి మొనగాడొచ్చాడని నిరూపించడమే ధ్యేయం!
బాలీవుడ్ లోను సినిమాలు తీసిన తెలుగు నిర్మాతగా మూవీ మొఘల్ దివంగత డా.డి.రామానాయుడుకి గొప్ప పేరుంది.
బాలీవుడ్ లోను సినిమాలు తీసిన తెలుగు నిర్మాతగా మూవీ మొఘల్ దివంగత డా.డి.రామానాయుడుకి గొప్ప పేరుంది. ఆ తర్వాత అల్లు అరవింద్ - మధు మంతెన లాంటి తెలుగు నిర్మాతలు చెప్పుకోదగ్గ హిట్ సినిమాల్ని నిర్మించారు. అరవింద్ `గజినీ` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో ఉత్తరాదినా `ది బాస్` అని నిరూపించారు. మధు మంతెన నిరంతరం హిందీ సినిమాల్ని నిర్మిస్తూ ట్రెండింగ్ లో ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు వంతు. తెలుగులో ఘనవిజయం సాధించిన జెర్సీ- హిట్ వంటి చిత్రాల్ని బాలీవుడ్ లో రాజుగారు రీమేక్ లు చేసారు. కానీ అవి రెండూ ఆశించిన విజయాల్ని సాధించకపోవడం నిరాశపరిచింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా దిల్ రాజు చేయని ప్రయత్నం లేదు.
ఎట్టకేలకు బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో భారీ ప్రాజెక్టును లైన్ లో పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సిద్ధార్థ్ ఇమేజ్ కి సరితూగుతుందని తెలిసింది. `హిట్` ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. శైలేష్ స్క్రిప్ట్‌ని సిద్ధార్థ్‌కి వివరించి అతని ఆమోదం పొందాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికారిక ప్రకటన చేస్తుందని తెలిసింది.
అన్నీ అనుకూలంగా కుదిరితే షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. సైలేష్ ప్రస్తుతం వెంకటేష్ తో సైంధవ్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ 2023 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం పూర్తి కాగానే సిద్ధార్థ్ తో మూవీ సెట్స్ కెళ్లేందుకు ఛాన్సుందని తెలిసింది. దిల్ రాజు కాంపౌండ్ నుంచి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్ ని ఉత్తరాదినా అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా నిర్మాతగా రాజు గారి పేరు మార్మోగడం ఖాయం. టాలీవుడ్ లో ఇప్పటికే దిల్ రాజు నిరూపించారు. ముంబైకి కూడా ఒకడొచ్చాడని పూవ్ చేసే రోజొస్తుంది.