లైగర్ సమస్యల పరిస్థితేంటి? డబుల్ ఇస్మార్ట్ కు పర్లేదా?
రెండేళ్ల క్రితం వచ్చిన లైగర్ మూవీ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే
రెండేళ్ల క్రితం వచ్చిన లైగర్ మూవీ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. అనేక విమర్శలు ఎదుర్కొంది. సినిమాపై విజయ్ పెట్టుకున్న హోప్స్ అన్నీ నీరుగారాయి. అంతే కాదు దేవరకొండపై నెట్టింట భారీగా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాన్ని మిగిల్చిందీ సినిమా.
ఈ విషయంలో అప్పుడు పెద్ద రచ్చే జరిగింది. అయితే లైగర్ మూవీ థియేట్రికల్ హక్కులను వరంగల్ శ్రీను దక్కించుకున్నారు. ఆ సమయంలో ఆయన చదలవాడ శ్రీనివాసరావు, శోభన్ తోపాటు పలువురితో కలిసి కొనుగోలు చేశారు. పూరి అంతకుముందు తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడం, విజయ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. నో రిటర్న్ అగ్రిమెంట్ ద్వారా వరంగల్ శ్రీను లైగర్ మేకర్స్ తో డీల్ కుదుర్చుకున్నారు.
అయితే మరో విషయమేమిటంటే.. వరంగల్ శ్రీను మిగతా వాళ్లలా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ కాదు. కాబట్టి ఎగ్జిబిటర్లతో కంటిన్యూ ర్యాపో ఉండదు. అందుకే ఆయనకు అడ్వాన్స్ లు ఇచ్చిన వాళ్లంతా.. డైరెక్ట్ గా తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలని మేకర్స్ ను అడుగుతున్నారు. కానీ వరంగల్ శ్రీను అందుకు ఒప్పుకోవడం లేదు. తానే ఇచ్చుకుంటా అని అన్నారు. ఆ సమయంలో పూరి.. మీరు మీరు తేల్చుకోండంటూ సేఫ్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇప్పుడు పూరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన మరో సినిమా రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఆ మధ్య బడ్జెట్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయని టాక్ వచ్చింది. ఫైనాన్స్ కూడా తీసుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఎలాగోలా సినిమా మాత్రం కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. అంతే కాదు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ రైట్స్ ను అమ్మనున్నారు.
అయితే డిజిటల్ రైట్స్ ఓకే గానీ.. థియేట్రికల్ విషయంలో ఏం జరుగుతుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లైగర్ తల నొప్పులు ఇంకా క్లియర్ అవ్వలేదు. కానీ డబుల్ ఇస్మార్ట్ కు టాలీవుడ్ బయ్యర్లు మంచిగా సహకరించాలి. అప్పుడే ఈజీగా మూవీ థియేటర్లలో విడుదల అవుతుంది. మరి పూరి జగన్నాథ్, చార్మి ఏం చేస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో, డబుల్ ఇస్మార్ట్ కు ఎలాంటి డీల్స్ జరుగుతాయో వేచి చూడాలి.