ఆడ-మగ మధ్య ఎట్రాక్షన్ 18 నెలలే!
పూరి తల్లి ప్రేమ గురించి విన్నాం..తండ్రి ప్రేమ గురించి విన్నాం...కానీ ప్రియురాలి ప్రేమ గురించి మాత్రం ఇంత వరకూ వినలేదు.
పూరి తల్లి ప్రేమ గురించి విన్నాం..తండ్రి ప్రేమ గురించి విన్నాం...కానీ ప్రియురాలి ప్రేమ గురించి మాత్రం ఇంత వరకూ వినలేదు. తాజాగా పూరి మ్యూజింగ్స్ ద్వారా అది కూడా షురూ చేసారు. `జీవితంలో చాలా మంది ప్రేమలో విఫలమవుతుంటారు. తిండి తినాలనిపించదు. నిద్ర రాదు. గుండెల్లో తెలియని మంటగా ఉంటుంది. మద్యానికి బానిసలవుతారు. స్నేహితులు ఎంత ఓదార్చినా ఆ బాధ తీరదు. కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. అదొక నరకం. మన ప్రేమను అమ్మాయి అర్దం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు. ఈగో.
నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. ఇది నిజం. నీకు దక్కలేదన్న ఉక్రోశమది. ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇలా పిచ్చోడివి అయ్యావు అని అందరూ తనకు చెప్పాలి. అదే నీ ఉద్దేశం. నిన్ను మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మకోసం ఏడ్చావా? అమ్మకోసం కత్తి పట్టి చేయి కోసుకున్నావా? లేదు. మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తున్నారు. కాళ్లు ..చేతులు లేని వాళ్లను కూడా ప్రేమించొచ్చు కదా? నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే తన నిర్ణయాలను గౌరవించు.
ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి అంగీకరించకపోతే చనిపోవాల నిపిస్తుంది. ఒకవేళ తను నిన్ను పెళ్లి చేసుకోమంటే? రెండేళ్లు కూడా కలిసి ఉండలేవు. మోజు తీరుతుంది. కొత్త కోరికలు మొదలవుతాయి. పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని చూసే పద్దతి మారుతుంది. సైన్స్ ప్రకారం ఆడ-మగ మధ్య ఎట్రాక్షన్ 18 నెలలు మాత్రమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారంతా వేరే ఏ అమ్మాయిని చూడరని ప్రామిస్ చేయగలరా? చేయలేరు. ప్రేమించడం..ఇంట్లో వద్దంటే గొవడవ పడటం..ఇవన్నీ సాధారణం.
మనం ఎక్కువగా ఈ డ్రామాలనే ఎంజాయ్ చేస్తాం. ప్రేమలో విఫలమైన అమ్మాయిలను ఎక్కడైనా చూసారా? వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. సందర్భాన్ని బట్టి వెళ్తుంటారు. వాళ్లను చూసి మిగతా వాళ్లు కూడా నేర్చుకోవాలి. ప్రేమలో ఫెయిలవ్వవడం ఎప్పుడూ మంచిదే. దాని వల్ల మనిషి స్ట్రాంగ్ అవుతాడు. కానీ ప్రేమించమని బ్రతిమలాడుతూ ఏడవొద్దు. ప్రేమను కోల్పోయి ఈ రోజు ఇంత ఏడుస్తున్నావ్ కదా? ఒక సంవత్సరం తర్వాత ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది.
నిజంగా అమ్మాయి మోసం చేస్తే ఆ బాధను కెరీర్ లో ముందుకెళ్లడం కోసం ఉపయోగించండి. ఒంటరితనం ప్రేమకంటే గొప్పది. ఒంటరిగా తినండి. ప్రయాణాలు చేయండి. కొన్నాళ్ల తర్వాత మీమ్మల్నిచూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్ ఫెయిల్ మీద మీరే జోకులేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. వాళ్లతో పోలిస్తే మన ప్రేమలు ఎంత? లవ్ లో ఫెయిలైతే పిచ్చి ఆలోచనలు మానండి. మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి` అని అన్నారు.