పుష్ప-2 తెలుగు ఈవెంట్.. ఆ రోడ్లన్నీ క్లోజ్..

నేడు (డిసెంబర్ 2) హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా వేడుకను నిర్వహించనున్నారు.

Update: 2024-12-02 04:45 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా 12వేల స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవ్వనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం వరుస ఈవెంట్స్ తో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో నిర్వహించిన అన్ని ఈవెంట్స్ సక్సెస్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న స్పెషల్ ఈవెంట్ కోసం రంగం సిద్ధం చేశారు. నేడు(డిసెంబర్ 2) హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా వేడుకను నిర్వహించనున్నారు.

ముంబై, పట్నా, కొచ్చి సహా పలు ఈవెంట్స్ కే భారీ ఎత్తున ఫ్యాన్స్ రాగా.. ఇప్పుడు తెలుగు ఈవెంట్ కు వేరే లెవెల్ లో వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఓపెన్ గ్రౌండ్ కావడంతో భారీ ఎత్తున అభిమానులు రానున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

పుష్ప 2 ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. వేడుక జరగనున్న ప్రాంతాన్ని ఆదివారమే అదనపు కమిషనర్‌ (శాంతి భద్రతలు) విక్రమ్‌ సింగ్‌ మాన్, ట్రాఫిక్‌ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తదితరులు పరిశీలించారు.

ఆ సమయంలో అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా నిర్వాహకులు శ్రీనివాస్ కూడా ఉన్నారు. అయితే దాదాపు 8 వేల మందికి పైగా పాసులు జారీ చేశారని ఏసీపీ తెలిపారు. దీంతో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కార్లను సవేరా అండ్‌ మహమూద్‌ ఫంక్షన్‌ హాళ్లలో పార్కు చేయాలని, జానకమ్మ తోటలో బైకులు పార్క్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

వేడుక జరగనున్న పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు చేపడుతున్నట్లు.. కాబట్టి ప్రజలు ఇతర రహదారుల నుంచి వెళ్లాలని పోలీసులు కోరారు. జూబ్లీహిల్స్, మైత్రీ వనం, బోరబండ మీదుగా వెళ్లే వాహనాలు ఆయా రూట్లలో వెళ్లాలని సూచించారు. ఈ మేరకు అన్ని వివరాలు ట్రాఫిక్ అడ్వైజరీలో వివరించారు. కాబట్టి దాన్ని గమనించి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే బెటర్!

Tags:    

Similar News