పుష్ప 2 డీల్.. ఇది నిజమైతే రికార్డే..
మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 350 కోట్ల భాటి బడ్జెట్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప 2 సినిమా చుట్టూ ఉన్న హైప్ ప్రస్తుతం మరింత పెరుగుతోంది. మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప 1 పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 కు వాయిదా పడింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తెలిపారు. ఈ నెలాఖరు నుంచి అక్టోబర్ నాటికి మరో రెండు పాటలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా చివరికి చేరుకుంటోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుందని బలంగా చెప్పుకొచ్చారు. ఇకపోతే పుష్ప 2 డిజిటల్ రైట్స్ గురించి వినిపిస్తున్న వార్త సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ద్వారా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఏకంగా రూ.270 కోట్లకు కొనుగోలు చేసినట్లు గాసిప్ ఒకటి వైరల్ అవుతోంది.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని, ఇదే గనక నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే బెస్ట్ రికార్డ్ అవుతుంది. బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ గా రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే పుష్ప 2లో రష్మిక మందన్నా పాత్రను మరింత బలంగా మలిచినట్లు సమాచారం. పుష్పరాజ్ మరియు భన్వర్ సింగ్ షెకావత్ మధ్య యాక్షన్ సన్నివేశాలు సినిమా హైలైట్‌గా నిలవనున్నాయి.
ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ ధనుంజయ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారు. పుష్ప 2పై ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 350 కోట్ల భాటి బడ్జెట్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇకపై మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని చిత్ర బృందం చెబుతోంది. మరోవైపు పుష్ప సీక్వెల్‌తో ఇక్కడే ఆగిపోదని, పుష్ప 3 కూడా వచ్చే అవకాశాలున్నాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటుడు రావు రమేశ్ వెల్లడించడమే ఇప్పుడు కొత్త చర్చలకు దారితీస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ వినాయకచవితి సందర్భంగా ఉండవచ్చని ఆ మధ్య ఒక టాక్ రాగా అందులో నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.