పుష్ప-2.. ఇంకెన్ని మార్పులు జరుగుతాయో?
అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వేసవిలో వస్తుందని అన్నారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 సినిమా కోసం నేషనల్ వైడ్ గా మూవీ ప్రియులతో పాటు బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు రెండున్నరేళ్లు దాటిపోయింది. 2021లో విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప-2పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వేసవిలో వస్తుందని అన్నారు. కానీ చివరకు ఆగస్టు 15వ తేదీన సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ తర్వాత కౌంట్ డౌన్ పోస్టర్లు కూడా షేర్ చేస్తూ.. పక్కాగా అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తామని తెలిపారు. బన్నీ కూడా మూవీని కచ్చితంగా అప్పుడే విడుదల చేయాలని మేకర్స్ కు హుకుం జారీ చేశారని టాక్ వచ్చింది.
కానీ ఇప్పుడు.. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వకపోవచ్చని ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తవ్వలేదు. రీసెంట్ గా మొదలైన కొత్త షెడ్యూల్ ఆగస్టు చివరి వరకు జరగనుంది. అందుకే మేకర్స్.. సినిమా రిలీజ్ ను వాయిదా వేయడం దాదాపు ఖరారైనట్టు సమాచారం. మూవీ షూటింగ్ పూర్తయ్యాక.. ఎడిటింగ్ వర్క్ జరగాలి. ఆ తర్వాత అన్ని భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి.
దీంతో ఇవన్నీ పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు అవుతుందని టాక్ నడుస్తోంది. అలా ఫస్ట్ కాపీ రెడీ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే మేకర్స్.. డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకున్నా.. అప్పటికీ అన్ని వర్క్స్ పూర్తి అవ్వవు. అందుకే పుష్ప-1లాగే డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పుడు నిర్ణయించుకున్నారని టాక్.
ఇప్పుడు అదే నిజమైతే.. మిగతా పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో కచ్చితంగా మార్పులు జరిగే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పోస్ట్ పోన్ అవుతున్నట్లు వార్తలు రాగా.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను ప్రీ పోన్ చేశారు మేకర్స్. ఇప్పుడు పుష్ప-2 వాయిదా పడితే.. ఆ డేట్ లో మరే పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.