ఆరోప‌ణ‌లు ఉన్నా అత‌డితో ప‌ని చేయ‌ని చెప్ప‌లేను: రాధిక‌

2017 కేసు తర్వాత దిలీప్‌తో పాటు మరో 12 మందిని అరెస్టు చేసిన తర్వాత జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇటీవల వెల్లడైన నేపథ్యంలో దిలీప్‌తో క‌లిసి ప‌ని చేయ‌డం గురించి రాధిక‌కు మీడియా నుంచి ప్ర‌శ్న ఎదురైంది.

Update: 2024-09-02 03:00 GMT

2017లో కొచ్చిలో ప్రముఖ క‌థానాయిక‌ అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మ‌ల‌యాళ స్టార్ హీరో దిలీప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అత‌డి సినిమాలో నటించాలనే తన నిర్ణయాన్ని సమర్థిస్తూ సీనియ‌ర్ నటి రాధికా శరత్‌కుమార్ మాట్లాడారు. దిలీప్‌తో కలిసి పనిచేయడానికి తాను నిరాకరించలేదని.. అతడు నిందితుడిగా ఉన్నాడు..కేసు ఇంకా కొనసాగుతోంద‌ని రాధిక చెప్పారు.

2017 కేసు తర్వాత దిలీప్‌తో పాటు మరో 12 మందిని అరెస్టు చేసిన తర్వాత జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుద‌లైంది. ఈ స‌మ‌యంలో దిలీప్‌తో క‌లిసి ప‌ని చేయ‌డం గురించి రాధిక‌కు మీడియా నుంచి ప్ర‌శ్న ఎదురైంది. ఏషియానెట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ ``అత‌డు నిందితుడు.. కేసు ఇంకా కొనసాగుతోంది.. కాబట్టి నేను వెళ్లి నిందితుడు కాబట్టి అతడితో నటించను అని చెప్పలేను. నా పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. ఎవరిపై ఆరోప‌ణ‌లు లేవు. అధ్వాన్నం(దారుణం)గా వ్య‌వ‌హ‌రించిన ముఖ్యమంత్రుల గురించి నేను మీకు చెప్పగలను. నేను వారితో మాట్లాడటం లేదా? వారు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని చూశాను. నేను ఈ వ్యక్తి లేదా ఫ‌లానా వ్యక్తి తప్పు చేశాడని వేలెత్తి చూపడానికి ఇక్కడ లేను`` అని అన్నారు.

17 ఫిబ్రవరి 2017న ప్రముఖ మలయాళ క‌థానాయిక‌ను కొంద‌రు వ్యక్తులు ఆమె కారులో అపహరించి, లైంగికంగా వేధించారు. ఇది కేరళ అంతటా కోపాగ్నికి కార‌ణ‌మైంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను ప‌రిశోధించేందుకు హేమా కమిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ నివేదిక కేరళ ప్రభుత్వానికి సమర్పించిన ఐదేళ్ల తర్వాత ఆగస్టు 19న బహిరంగపరచగా అది సంచ‌ల‌నంగా మారింది. `పావి కేర్‌టేకర్` అనే చిత్రం ఈ సంవత్సరం ప్రారంభంలో థియేట‌ర్ల‌లో విడుదలైంది. మిశ్రమ స్పంద‌న‌లు అందుకుంది. ఈ చిత్రంలో దిలీప్ తో క‌లిసి రాధిక శ‌ర‌త్ కుమార్ న‌టించారు.

Tags:    

Similar News