'ఆస్కార్ క్లాస్ ఆఫ్ 2024'లో SS రాజమౌళి

ఆహ్వానితులంతా ఆహ్వానాలను అంగీకరిస్తే అకాడమీ మొత్తం సభ్యత్వం 10,910కి పెరుగుతుంది.

Update: 2024-06-26 04:47 GMT

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ క‌మిటీ) ఇటీవల 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానాలను అందజేసినట్లు ప్రకటించింది. ఇందులో భార‌తీయ సినీ దిగ్గ‌జాలు ఎస్ఎస్ రాజమౌళి, ఆయ‌న స‌తీమ‌ణి రమా రాజమౌళి, రితేష్ సిధ్వానీ, స‌బానా ఆజ్మీ స‌హా ప‌లువురు ఉన్నారు. అకాడెమీ పిలుపు మేర‌కు వీరంతా 'క్లాస్ ఆఫ్ 2024'లో చేరాల్సి ఉంది. ఆహ్వానితులు 71 మంది ఆస్కార్ నామినీలు, వీరిలో 19 మంది విజేతలు ఉన్నారు. పైన వెల్ల‌డించిన‌ ప్రముఖులతో పాటు సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ఫిల్మ్ మేకర్ రీమా దాస్, నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌లకు కూడా ఆహ్వానాలు అందాయ‌ని స‌మాచారం. ఆహ్వానితులంతా ఆహ్వానాలను అంగీకరిస్తే అకాడమీ మొత్తం సభ్యత్వం 10,910కి పెరుగుతుంది. ఇందులో 9,000 మంది ఓటు వేయడానికి అర్హులు.

'ది అకాడమీ' పత్రికా ప్రకటన ప్రకారం... క్లాస్ ఆఫ్ 2024లో 44 శాతం మహిళలు, 41 శాతం నిమ్న జాతి (తక్కువ ప్రాతినిధ్యం వ‌హించేవారు) లేదా వర్గాలకు చెందినవారు ఉన్నారు. అమెరికా వెలుపల 56 దేశాలు, భూభాగాల నుంచి వీరి ఎంపిక సాగింది. అకాడమీ CEO బిల్ క్రామెర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ -''ఈ సంవత్సరం అకాడమీకి కొత్త సభ్యులను తరగతికి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అసాధారణ ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులు మా ఫిలింమేకింగ్ సంఘంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు'' అని అన్నారు. విభిన్న‌ శాఖలకు ఆహ్వానాలు అందుకున్న వారు సభ్యత్వాన్ని అంగీకరించిన తర్వాత వాటిలో ఏదో ఒక శాఖను ఎంచుకోవలసి ఉంటుంది.

అకాడెమీ సెమినార్ లు, వ‌ర్క్ షాప్ ల‌కు వీరంతా హాజ‌ర‌వుతారు. ఇంత‌కుముందు అకాడెమీలో చేరాల్సిందిగా ఆర్.ఆర్.ఆర్ న‌టులు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, లిరిసిస్ట్ చంద్ర‌బోస్, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణికి ఆహ్వానాలు అందిన సంగ‌తి తెలిసిందే. సత్యజిత్ రే, మీరా నాయర్ , కరణ్ జోహార్, గునీత్ మోంగా, జోయా అక్తర్ వంటి వారు అకాడెమీలో ఉన్నారు.

ఇప్పుడు కొత్త‌గా స‌భ్య‌త్వం అందుకున్న ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబు తో భారీ పాన్ వ‌ర‌ల్డ్ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. ఇది ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీ. ర‌మా రాజ‌మౌళి ఇప్ప‌టికే కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. మరోవైపు షబానా అజ్మీ చివరిగా `ఘూమర్‌`లో కనిపించింది. 2023లో థియేటర్లలోకి వచ్చిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలోను ష‌బానా నటించింది. అలియా భట్ -రణవీర్ సింగ్ టైటిల్ పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో జయ బచ్చన్, ధర్మేంద్ర కూడా నటించారు. రాజమౌళి తన మొట్టమొదటి అంతర్జాతీయ చిత్రం SSMB 29 కోసం సిద్ధమవుతున్న స‌మ‌యంలో అకాడెమీ అందించిన‌ గౌర‌వం త‌న‌కు అద‌న‌పు బూస్ట్‌నిస్తుంద‌నడంలో సందేహం లేదు.

Tags:    

Similar News