హిరాణీ సినిమాకి రాజమౌళి ప్రశంస కలిసొస్తుందా?
3 ఇడియట్స్, పీకే, సంజూ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరాణీ ఇప్పుడు `డంకీ` సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నారు.
3 ఇడియట్స్, పీకే, సంజూ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరాణీ ఇప్పుడు `డంకీ` సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నారు. అతడు తెరకెక్కించిన గత సినిమాలకు భిన్నమైన కంటెంట్ ఉన్న ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారూఖ్ నటించడం ఆసక్తిని కలిగిస్తోంది. డంకీ ఈ నెల 21న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో తలమునకలుగా ఉండగా, కింగ్ ఖాన్ షారూఖ్ ఇవేవీ పట్టనట్టు వైష్ణోదేవి ఆలయంలో పూజలు పునస్కారాలకు ప్రాధాన్యతనివ్వడం చర్చకు వచ్చింది.
డంకీ డ్రాప్ 4 ఇటీవల విడుదలై ఖాన్ అభిమానుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. ఫీల్-గుడ్ ట్రైలర్ రిఫ్రెషింగ్‌గా ఉందంటూ ప్రశంసలు కురిసాయి. చాలా ఎమోషన్స్‌తో హృదయాలను స్పృశించే రాజ్‌కుమార్ హిరాణీ మార్క్ ఈ ట్రైలర్ లో కనిపించిందని ప్రశంసించారు. ఇది సినిమా ఆద్యంతం పండుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రేక్షక దేవుళ్లు డంకీ డ్రాప్ 4ని ప్రశంసిస్తుండగా, రాజ్‌కుమార్ హిరానీ టెక్నిక్‌ను, స్క్రీన్‌పై భావోద్వేగాలను ప్రదర్శించే విధానాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
దర్శకుడు రాజమౌళి రాజ్‌కుమార్ హిరాణీని ..అతని సినిమాటిక్ క్రాఫ్ట్‌ను ప్రశంసిస్తూ కనిపించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ``నిజం ఏమిటంటే నేను రాజు హిరానీ చేసే ఒక్క సీన్ కూడా చేయలేను. నేను చేసే పని కంటే అతను చేసే పని చాలా గొప్ప పని అని నేను భావిస్తున్నాను. నేను కరణ్ ఆయనలాంటి సినిమాలు తీయలేం`` అని అన్నారు. రచన దర్శకత్వంలో రాజ్ కుమార్ హిరాణీ సూక్ష్మ పరిశీలనపైనా రాజమౌళి ప్రశంసలు కురిపించారు. భావోద్వేగాలతో ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మమైన పరిశీలనాత్మక శక్తితో తీర్చిదిద్దే హిరాణీ టెక్నిక్ నాకంటే ఎంతో గొప్పది అని ప్రశంసించారు. ఈ ప్రశంసల వీడియో ఇప్పుడు హిరాణీకి మైలేజ్ పెంచుతోంది. తదుపరి రిలీజ్ కి రానున్న డంకీకి ఇది ప్రధాన అస్సెట్ కానుంది.
డంకీలో ఖాన్ తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ తదితరులు ఆసక్తికర పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిలిమ్స్ సమర్పణలో రాజ్‌కుమార్ హిరాణీ- గౌరీ ఖాన్ నిర్మించారు. డంకీ డిసెంబర్ 2023న విడుదల కానుంది. డంకీ నుంచి వరుస ట్రైలర్లు వీక్షించాక ఇది కేవలం క్లాస్ ఆడియెన్ ని మెప్పించే సినిమా అని మాస్ ని చేరలేదని కూడా ఇటు సౌత్ లో క్రిటిక్స్ విశ్లేషించిన సంగతి తెలిసిందే.