తొలి ఇండియన్ సినిమాగా 'జైలర్' రికార్డు!
సూపర్ స్టార్ రజనీ కాంత్ కథానాయకుడిగా నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోన్న సంగతి తెలిసిందే
సూపర్ స్టార్ రజనీ కాంత్ కథానాయకుడిగా నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 10 న రిలీజ్ అయిన 'జైలర్' దూకుడుని ఏ సినిమా ఆపలేకపోతుంది. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలన్నీ జైలర్ కలెక్షన్లు పెంచుతున్నాయో! జైలర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలే కపోతున్నాయి. తాజాగా ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది.
ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల క్లబ్ లో చేరి నాన్ సీక్వెల్ చిత్రాల కేటగిరిలో భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్..తెలంగాణ..తమిళనాడు..కర్ణాటక..కేరళలో ఒక్కో రాష్ట్రం నుంచి 50 కోట్లు సునాయాసంగా రాబట్టింది. ఇప్పటివరకూ ఈ ఘనత 'కేజీఎఫ్ -2'..'బాహుబలి-2' మాత్రమే సాధించాయి. అవి సీక్వెల్స్ క్యాటగిరీలో.' జైలర్' మొదటి భాగమే బాక్సాఫీస్ వద్ద రప్పాడించడంతో అభిమానులు సంబరాలు షురూ చేసారు.
సోషల్ మీడియా వేదికగా అభిమానులు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే జైలర్ అన్ని ప్రాంతాల్లో కలుపుకుని 525 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది. అంతకు ముందు రజనీ నటించిన తలైవా తమిళనాడు మినహా ఎక్కడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇంకా ముందుకెళ్తే 'దర్బార్'..'కాలా'..'పెట్టా' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో రజనీ ఇమేజ్ పై మార్కెట్ లో ప్రతికూల ప్రభావం కొంతవరకూ చూపింది. అదే సమయంలో బయ్యర్లు రోడ్డెక్కడం వంటి సన్నివేశాలు సూపర్ స్టార్ కి మచ్చలా మారాయి. తాజాగా 'జైలర్' విజయంతో అన్నింటిని తుడిచిపెట్టేసి బాక్సాఫీస్ వద్ద భాషా ఈజ్ బ్యాక్ అనిపించారు. ఈ విజయం నేపథ్యంలో జైలర్ సీక్వెల్ కూడా ఉండొచ్చని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ హింట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు తలైవా పుణ్యక్షేత్రాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ అని స్వామీజి చెప్పారంటూ విజయం అనంతరం రజనీ సంతోషం వ్యక్తం చేసారు.