రజినీకి ఆయన డబ్బింగ్ చెప్పలేదేంటి?
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా తెలుగులో డబ్ అవుతోందంటే.. అందులో గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో వాయిస్ వినిపించాల్సిందే.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా తెలుగులో డబ్ అవుతోందంటే.. అందులో గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో వాయిస్ వినిపించాల్సిందే. రజినీకాంత్ ఒరిజినల్ వాయిస్ తెలిసిన వాళ్లు కూడా మనోకు బాగా అలవాటైపోయి వేరే వాయిస్ వినిపిస్తే జీర్ణించుకోలేరు. రెండు దశాబ్దాల కిందట్నుంచి రజినీకి మనోనే డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. నరసింహ రోజుల నుంచి మొన్నటి జైలర్ వరకు రజినీకి చాలా వరకు మనోనే డబ్బింగ్ చెప్పారు. కథానాయకుడు మూవీలో మాత్రమే రజినీకి బాలు గాత్రదానం చేశారు. ఐతే ఇప్పుడు రజినీ పాత్రను తెలుగులో వేరే వాయిస్‌తో చూడబోతున్నాం. నటుడు, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ రజినీకి చాలా గ్యాప్ తర్వాత డబ్బింగ్ చెప్పడం విశేషం.
లాల్ సలాం సినిమాలో రజినీకి సాయికుమారే వాయిస్ ఇచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో రజినీ పాత్రకు డైలాగ్స్ సాయికుమార్ వాయిస్‌లోనే వినిపించాయి. ఇది ట్రైలర్ వరకు పరిమితమైన ఏర్పాటు కాకపోవచ్చు. సినిమాలో కూడా సాయికుమారే డబ్బింగ్ చెప్పినట్లున్నాడు. ఈ చిత్రంలో రజినీ చేసింది పూర్తి స్థాయి పాత్ర కాదు. ద్వితీయార్ధంలో అరగంట నిడివితో ఆయన పాత్ర ఉంటుందంటున్నారు. అందుకే మనోను సంప్రదించలేదా.. లేక వేరేదైనా కారణంతో మార్పు జరిగిందా అన్నది తెలియదు. రజినీ సినిమా అనే కానీ.. లాల్ సలాం మీద తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఎన్నడూ లేనంత లో బజ్‌తో రజినీ సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళంలో కూడా ఈ సినిమాకు పెద్దగా హైప్ లేదు. విష్ణు విశాల్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని రజినీ తనయురాలు ఐశ్వర్యనే డైరెక్ట్ చేసింది.