1995 క్లాసిక్ రీమేక్‌లో ఇద్దరు సూపర్‌స్టార్లు
1995లో విడుదలై సంచలన విజయం సాధించిన క్లాసిక్ సినిమా `కరణ్ అర్జున్` రీమేక్ గురించి దర్శకనిర్మాత రాకేష్ రోషన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి
1995లో విడుదలై సంచలన విజయం సాధించిన క్లాసిక్ సినిమా `కరణ్ అర్జున్` రీమేక్ గురించి దర్శకనిర్మాత రాకేష్ రోషన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాకేష్ రోషన్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ సినిమా `కరణ్ అర్జున్` రీమాస్టర్డ్ వెర్షన్ నవంబర్ 22న మళ్లీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి.
అప్పటి స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్-సల్మాన్ ఖాన్‌ల కలయికలో వచ్చిన `కరణ్ అర్జున్` అప్పట్లో సంచలన విజయం సాధించింది. గత జన్మలో తమ మరణానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పునర్జన్మ పొందిన ఇద్దరు సోదరుల పాత్రలో ఖాన్ లు నటించారు. ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి రానుండడంతో దర్శకుడు రాకేష్ రోషన్ కి మీడియా నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవేళ కరణ్ అర్జున్ ని రీమేక్ చేస్తే ఇప్పటి తరంలో ఏ హీరోలు నటిస్తే బావుంటుంది? అన్న ప్రశ్నకు రాకేష్ రోషన్ సమాధానమిచ్చారు. నేటితరంలో హృతిక్-రణబీర్ లకు అవకాశం కల్పిస్తానని అన్నారు. హృతిక్ ను కరణ్ గా, రణబీర్ ను అర్జున్ గా చూడాలనుకుంటున్నానని అన్నారు. అయితే ఈ సినిమాకి రీమేక్ కానీ సీక్వెల్ కానీ చేసే ఆలోచన లేదని అన్నారు.
అలాగే షారూఖ్ ఖాన్‌ను అర్జున్ సింగ్‌గా , సల్మాన్ ఖాన్‌ను కరణ్ సింగ్‌గా ఎందుకు ఎంపిక చేసుకున్నారో కూడా చర్చించారు. సల్మాన్ ఫిజిక్ ఆకర్షణీయమైన కళ్ళు ఆ పాత్రకు సూటబుల్. అలాగే `ఫౌజీ`, `కింగ్ అంకుల్`లో షారుఖ్ ఖాన్ నటనను ఇష్టపడ్డాను.. అందుకే అర్జున్ గా అవకాశం కల్పించానని అన్నారు.