వర్మలో పశ్చాత్తాపం.. నిజమేనా?
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆయన తనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు ఒకప్పుడు వెండి తెర మీద ఎలాంటి అద్భుతాలు ఆవిష్కరించాడో.. గత పది పదిహేనేళ్లలో ఎలాంటి చెత్త సినిమాలు తీశాడో అందరికీ తెలిసిందే. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఆయన మీద పూర్తిగా ఆశలు కోల్పోయి తనను పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు అంత గొప్ప సినిమాలు తీసి.. ఇప్పుడు ఇలాంటి చిత్రాలు చేస్తున్నారేంటి అని అడిగితే.. నా మీద అంచనాలు పెట్టుకోవడం మీ తప్పు, నా సినిమాలు చూడమని నేనడిగానా అంటూ వితండవాదం చేయడం వర్మకు అలవాటు.
నాసిరకం పొలిటికల్ ప్రాపగండా సినిమాలు.. బిగ్రేడ్ చిత్రాలు తీసుకుంటూ తన విలువను పూర్తిగా పోగొట్టుకున్నాడు వర్మ. కానీ తానేం చేసినా దాని గురించి సమర్థించుకోవడం అలవాటైన వర్మ.. పడిపోయిన తన ప్రమాణాల గురించి ఎప్పుడూ ఆత్మపరిశీలన చేసుకోవడం, పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కనిపించదు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆయన తనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
తన కెరీర్లో బెస్ట్ ఫిలిమ్స్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ‘సత్య’ సినిమాను 27 ఏళ్ల తర్వాత చూశాక తనలో ఏదో రియలైజేషన్ వచ్చేసినట్లు వర్మ చెబుతున్నాడు. ఆ సినిమాను ఇప్పుడు చూసుకుంటే కన్నీళ్లు వచ్చేశాయని.. అంత గొప్ప సినిమా తీశాక తాను మళ్లీ అలాంటి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించకపోవడం పొరపాటని వర్మ అంటున్నాడు. ‘సత్య’ సినిమాను మళ్లీ చూసుకుని ఉన్నా, మళ్లీ అలాంటి స్టాండర్డ్స్‌తో సినిమా తీయాలని ప్రయత్నించి ఉన్నా.. తాను ఆ తర్వాత తీసిన 90 శాతం సినిమాలు రాకపోయి ఉండేవని వర్మ అన్నాడు. సత్య తర్వాత అలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదని వేరే వాళ్లూ తనను అడగలేదని.. అలాగే తనను తాను కూడా ప్రశ్నించుకోలేదని వర్మ పేర్కొన్నాడు. సత్య తర్వాత తాను తాగుబోతు అయిపోయానని.. కానీ తాను తాగింది ఆల్కహాల్ కాదని.. తలపొగరు అని వర్మ వ్యాఖ్యానించాడు.
‘సత్య’ తర్వాత షాక్ ఫ్యాక్టర్‌తో సినిమాలు తీయడానికి ప్రయత్నించానని.. అంతే తప్ప సత్య లాంటి ఒరిజినాలిటీతో కూడిన సినిమాలు తీయలేకపోయానని వర్మ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇకపై తాను సిన్సియర్‌గా సత్య స్థాయి సినిమాలే తీయడానికి ప్రయత్నిస్తానని.. ఇది సత్య మీద తాను చేస్తున్న ప్రమాణం అని ఈ పోస్టును ముగించాడు వర్మ. ఐతే వర్మ వ్యవహారం తెలిసిన వాళ్లంతా.. నిజంగా ఆయన పశ్చాత్తాపం వచ్చిందా.. మళ్లీ నిన్నటి పోస్ట్ తూచ్ అంటూ మళ్లీ ఇంకో పోస్టుతో అందరినీ ఫూల్స్‌ను చేస్తాడా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.