షారూఖ్-కమల్‌హాసన్‌లతో RGV ప్లాన్?
తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో రామ్ గోపాల్ వర్మ 'కంపెనీ' కాస్టింగ్ ప్రాసెస్ గురించి చాలా రహస్యాలను బయటపెట్టారు.
సంచలనాల రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతడు షారూఖ్-కమల్‌హాసన్-అభిషేక్‌లతో మల్టీస్టారర్ ప్లాన్ చేసారా? అంటే అవుననే సమాచారం. ఈ వార్త పూర్వాపరాల్లోకి వెళితే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ది గ్రేట్ ఆర్జీవీ తెరకెక్కించిన 2002 గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ 'కంపెనీ' వెనక చాలా సంగతులున్నాయి. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల విషయంలో కొన్ని గమ్మత్తయిన విషయాలను ఆర్జీవీ బహిర్గతం చేసారు. నిజానికి వర్మ తన ప్రారంభ కాస్టింగ్ ఆలోచనల్లో అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్‌లు అసలు లేనే లేరని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వారికి బదులుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్ర కోసం షారూఖ్ ఖాన్‌ను సంప్రదించాడట. ఛోటా రాజన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ ని నటింపజేయాలని అనుకున్నాడు. మోహన్‌లాల్ పోషించిన పాత్రలో కమల్ హాసన్‌ను నటింపజేయాలని కూడా భావించారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో రామ్ గోపాల్ వర్మ 'కంపెనీ' కాస్టింగ్ ప్రాసెస్ గురించి చాలా రహస్యాలను బయటపెట్టారు. కొన్ని నిర్దిష్ట సన్నివేశాల గురించి చర్చిస్తూ .. కాస్టింగ్ ప్రక్రియపై చాలా తెలియని విషయాలను తెలిపారు. దావూద్ ఇబ్రహీం పాత్రకు షారూఖ్ ఖాన్‌ను ఎంపిక చేయాలనే తన ప్రారంభ ఆలోచనను వర్మ వెల్లడించాడు.. అజయ్ దేవగన్ మాలిక్ పాత్రధారి కాదు అని అన్నారు. ఒక సమయంలో నేను షారుఖ్ కావాలని కోరుకున్నాను. నేను కలిశాను.. అతడు ఆ పాత్ర చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. ''దావూద్ గా షారూఖ్ కావాలి.. కానీ అతడు చాలా హైపర్ అని నేను భావించాను.. అతడి శక్తి, ఆయన తీరు... ప్రజలు ఇష్టపడేది వేరు'' అని నేను అనుకున్నాను. అతడిని చిన్నగా.. అస్సలు కదలకుండా .. చాలా నిశ్శబ్దంగా చూపిస్తే అది తెరపై చాలా బేసిగ్గా కనిపిస్తుందని అనుకున్నాను. నేను షారూఖ్ ని ఎంపిక చేసుకోకపోవడానికి కారణం ఇదే. నేను ఖాన్‌ని ఒక్కసారి మాత్రమే కలిసాను.. కానీ తన బాడీ లాంగ్వేజ్ తప్పు.. ఈ పాత్రకు సరికాదు! అని నేను భావించాను కాబట్టి నేను ఇకపై వెంబడించలేదు.. అని తెలిపారు.
షారూఖ్ లో ఒక నటుడు ఉన్నాడు.. ఒక పెర్ఫార్మర్ ఉన్నాడు. అతడు ఉత్తమ పెర్ఫార్మర్... హైపర్యాక్టివ్, ఈ పాయింటే ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ సోమరి పాత్రకు అతడు సరికాదు అనుకున్నాను. అయితే ఇది అజయ్ సహజ బాడీ లాంగ్వేజ్ కాబట్టి... ఆ పాత్రకు అజయ్ మరింత పర్ఫెక్ట్ అని నేను అనుకున్నాను. అలా ఎంపిక పూర్తయింది! అని ఆర్జీవీ తెలిపారు. తన సినిమా కంపెనీలో చందు పాత్ర అలాగే ముంబై పోలీస్ కమీషనర్ పాత్రల కోసం నటీనటుల ఎంపిక గురించి చర్చిస్తూ.. తన ఆలోచనలను రివీల్ చేసారు. ప్రారంభంలో నిజానికి ఆ పాత్ర కోసం కమల్ హాసన్‌ని సంప్రదించాలనుకున్నాను. ఆయన్ని కూడా కలిశాను. కానీ అక్కడ కూడా నాకు షారూఖ్‌తో ఉన్న సమస్యనే అనిపించింది. వారి సహజమైన స్టార్‌డమ్ వాస్తవిక (రియలిస్టిక్) చిత్రంలో అంతగా కనిపించదు. అందుకే నా మనసు మార్చుకుని మోహన్‌లాల్‌ను సంప్రదించాను అని ఆయన పేర్కొన్నారు.
షారూఖ్ ఖాన్ కంపెనీలో గ్యాంగ్‌స్టర్ పాత్ర కోసం ఎంపిక చేయకపోయినా..ఆ తరువాత 'రయీస్' చిత్రంలో అదే తరహా పాత్రను షారూఖ్ పోషించాడు. ఇది మిశ్రమ స్పందనలు అందుకుంది.. యావరేజ్ గా ఆడింది.. బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది.