రానా దగ్గుబాటి కెరీర్‌లో తెలివైన పెట్టుబడి?
కామిక్స్ చదివేందుకు పిల్లలు అమితంగా ఇష్టపడతారు. అందరిలానే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే రానా దగ్గుబాటి కామిక్ కథల్ని విపరీతంగా ఇష్టపడ్డాడు.
కామిక్స్ చదివేందుకు పిల్లలు అమితంగా ఇష్టపడతారు. అందరిలానే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే రానా దగ్గుబాటి కామిక్ కథల్ని విపరీతంగా ఇష్టపడ్డాడు. బడికి వెళ్లే రోజుల్లోనే అమర్ చిత్ర కథలోని కథలతో రానా జీవించాడు. అతడి అభిరుచి ఇప్పుడు తెలివైన పెట్టుబడులు పెట్టే దిశగా ప్రేరేపించింది. అతడు ప్రతిష్ఠాత్మక కామిక్ అమర్ చిత్ర కథ టైటిళ్లకు హక్కుదారు అయ్యాడు. అంతేకాదు.. ఇప్పుడు అమర్ చిత్ర కథ, హిరణ్యకశిప వంటి కథలను వెండితెరకెక్కించేందుకు నిర్మాతగా నటుడిగా తనవంతు కృషి చేస్తున్నారు.
నిజానికి పాత రోజుల్లో హిరణ్యకశిపునిపై సినిమాలు తెరకెక్కి విజయం సాధించాయి. భక్త ప్రహ్లాద చిత్రం తెలుగు సినిమా హిస్టరీలో అత్యంత భారీ విజయం సాధించిన సినిమా. రాక్షసరాజు అంతానికి కారకుడయ్యే విష్ణు భక్తుడైన భక్తప్రహ్లాదుని కథను తెరపై నాటి ప్రజలు వీక్షించి ఆనందించారు. కానీ నేటితరానికి ఇవి అందుబాటులో ఉన్నాయా? అంటే ఇప్పటికీ తెలుగు యువతకు యూట్యూబ్ మాధ్యమంలో ఈ సినిమాని వీక్షించే సౌలభ్యం ఉంది. కానీ ఇప్పుడు కాన్వాస్ వేరు. బడ్జెట్లు వేరు. విజువల్ మాయాజాలం వేరు. నేటి స్కేల్ లో చూపిస్తేనే ఇప్పటి తరానికి ఈ కథలు గొప్పగా ఎక్కుతాయి అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇప్పుడు నిర్మాతగా రానా దగ్గుబాటి ఆలోచిస్తున్నది కూడా ఇదే.
మారిన కాన్వాసులో ఇలాంటి సినిమాని పెద్ద తెరపై చూడాలన్న తపనను పెంచేందుకు ఇప్పుడు దగ్గుబాటి రానా చేస్తున్న కృషిని ప్రశంసించి తీరాలి. అతడు ఇప్పుడు అమర్ చిత్రకథను పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ కేటగిరీలో అన్ని భాషల్లో ప్రజలందరికీ చూపించేలా అత్యంత భారీగా నిర్మించాలని, ఒక డిసి కామిక్స్ రేంజులో ఆవిష్కరించాలని కలలు గంటున్నాడు. దానికోసం పని కూడా ఎప్పుడో మొదలు పెట్టేశాడు. త్రివిక్రమ్ లాంటి ప్రముఖ దర్శకరచయిత సహకారంతో హిరణ్య కశిప కథను తీర్చిదిద్దుతున్న రానా, వరుసగా ఈ సిరీస్ లో సినిమాలు తీయాలని భావిస్తున్నారు.
రానా దగ్గుబాటి తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ-``ఈ కామిక్స్ చదవడం మా అమ్మ నుండి నాకు వారసత్వంగా వచ్చినప్పటికి నేను చాలా చిన్నవాడిని. నేను ఆ కథలతో జీవించాను. ఈ కథలన్నీ ఎంతో గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు నటుడిగా చిత్రనిర్మాతగా నన్ను ప్రేరేపించాయి`` అని చెప్పారు. అమర్ చిత్ర కథ గురించి తెలిసిన భారతీయేతరుల సంఖ్య ఆకర్షిస్తోంది. కథలు ఎల్లప్పుడూ ప్రజలను ఏకం చేస్తూనే ఉంటాయని నేను భావిస్తున్నాను. మనం ఏ సంస్కృతి ఏ భాష నుండి వచ్చామన్నది ముఖ్యం కాదు. మనమంతా రాష్ట్రాలు.. భాషల వారీగా విభజించబడ్డాం. కానీ కళ మనల్ని ఏకం చేస్తుంది అని రానా చెప్పాడు. శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC 2023)లో ప్రతిష్టాత్మకమైన హిరణ్యకశిప కాన్సెప్ట్ టీజర్‌ను ఆవిష్కరించినప్పుడు అమర్ చిత్ర కథ కామిక్స్‌పైనా భారతీయేతర ప్రేక్షకులు చూపించిన ఆసక్తి మంచి ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.
పౌరాణిక-చారిత్రక కథలను సినిమాల కోసం స్వీకరించే ఆలోచన ఎల్లప్పుడూ తనకు ఆసక్తిని కలిగిస్తుందని రానా అన్నారు. కానీ SS రాజమౌళి రెండు భాగాల యాక్షన్ ఎపిక్ బాహుబలిలో నటించాక.. అది చివరకు హిరణ్యకశ్యప్ ని తెరకెక్కించగలమనే విశ్వాసాన్ని ఇచ్చింది. బాహుబలి తర్వాత ఎలాంటి సినిమాలు తీయాలో ఏది అవసరమో మాకు అర్థమైంది. ACK అనేది నా సహజ ఎంపిక. ఎందుకంటే ఇది నాకు చిన్నప్పుడే తెలుసు. ఈ కథలన్నీ యువ ప్రపంచంలోకి తిరిగి రావడానికి ఒక మంచి మార్గం కావాలి.. అన్నారు. ప్రహ్లాదుడు - రాక్షస రాజు హిరణ్యకశ్యపు కథను వివరించిన 1967 తెలుగు చిత్రం `భక్త ప్రహ్లాద`ను ఉదహరిస్తూ.. దగ్గుబాటి రానా ఈ చిత్రం దక్షిణ భారతదేశంలో పాపులరైందని, కొత్త వెర్షన్‌తో కథను మరింత ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉందని తెలిపారు. విశ్వంలోని కొన్ని కథల్లో ఇది ఒకటి. ఇది తండ్రి కొడుకుల కథ. ఈ కథ ఎంపిక సరైనదని మేము భావించాము అన్నారు.
హిరణ్యకశ్యప్ ప్రస్తుతం రచన దశలో ఉంది. ప్రీ-ప్రొడక్షన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ కి పని చేస్తున్నారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ అమర్ చిత్రకథ (ACK) కామిక్స్ నుండి మరిన్ని కథలను సినిమాలుగా మలచాలని తాము భావిస్తున్నామని, అయితే ఒకేసారి ఒక ప్రాజెక్ట్‌పై మాత్రమే దృష్టి పెడతామని చెప్పారు. హిరణ్యకశ్యప మొదటిది మాత్రమే.. ఇంకా చాలా కథలున్నాయి. మేము భవిష్యత్తులో వాటిని ప్రకటిస్తాము. ఇవి పెద్ద సినిమాలు.. విపరీతమైన ప్రిపరేషన్ సాగించాల్సినవి`` అని తెలిపారు.