రవితేజ భలే టైటిల్ పట్టాడు..!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన 75వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన 75వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకు రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్న భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న సామజవరగమన సినిమా కి రచయితగా వర్క్ చేశాడు. విభిన్న కథలతో మెప్పించిన భాను చాలా కొత్తగా ఉండే కథతో రవితేజ తో సినిమాను చేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ను దాదాపుగా కన్ఫర్మ్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి గాను 'కోహినూర్' అనే పవర్ ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ వర్కింగ్ టైటిల్ గా ఈ టైటిల్ ను పరిగణిస్తున్నారు. త్వరలోనే ఈ టైటిల్ నే అధికారిక టైటిల్ గా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. రవితేజ భలే టైటిల్ ను పట్టాడే అని అప్పుడే కొందరు కామెంట్ చేస్తున్నారు. రవితేజ మాస్ టైటిల్స్ తో, క్యాచీ టైటిల్స్ తో వచ్చిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక కోహినూర్ టైటిల్ కూడా చాలా బాగుంది కనుక ఈ మూవీ హిట్ అవ్వడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ 75వ సినిమాగా రాబోతున్న కోహినూర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. రవితేజతో శ్రీలీల ఇప్పటికే ధమాకా సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఇద్దరి కాంబో కి మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఈ సినిమాలో కూడా శ్రీలీలను నటింపజేస్తున్న నేపథ్యంలో అందరి అంచనాలను ఆకర్షిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.
భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సంక్రాంతికి పెద్ద ఎత్తున పోటీ ఉంది. ముఖ్యంగా చిరు విశ్వంభర సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. అయినా కూడా కోహినూర్ సినిమాను విడుదల చేయాల్సిందే అన్నట్లుగా మేకర్స్ పట్టుదలతో ఉన్నారట. షూటింగ్ కూడా అందుకోసం చాలా స్పీడ్ గా జరుపుతున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల అయితే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయి. ఎన్ని సినిమాలు సంక్రాంతికి విడుదల అయినా కూడా అన్నింటికి కూడా మంచి వసూళ్లు నమోదు అవుతాయి.
రవితేజ గతంలో సంక్రాంతి సందర్భంగా వచ్చిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తే సెంటిమెంట్ గా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రవితేజ కి సక్సెస్ ల కంటే ఫ్లాప్స్ ఎక్కువ పడుతున్నాయి. దాంతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. రవితేజ కూడా ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. మరో వైపు ఈనెల 15న రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ విడుదల అవుతున్న విషయం తెల్సిందే. కోహినూర్ కి ముందు రాబోతున్న రవితేజ మిస్టర్ బచ్చన్ ఫలితం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరికీ ఉంది.