రవితేజ 75వ దావత్.. వచ్చే సంక్రాంతికే..

టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ.. ఇటీవల ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

Update: 2024-04-09 07:59 GMT

టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ.. ఇటీవల ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈమధ్య రవితేజ.. గతేడాది రిలీజైన సామజవరగమన మూవీ రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడిదే నిజమైంది. మిస్టర్ బచ్చన్ తర్వాత రవితేజ భాను భోగవరపును దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తన ల్యాండ్ మార్క్ 75వ సినిమా చేయనున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు క్యాప్షన్ ద్వారా ఆ సంస్థ తెలిపింది. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో గ్రామంలో జాతర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద RT 75 రాసి ఉండడం అట్రాక్టివ్ గా ఉంది. "రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి".. "హ్యాపీ ఉగాది రా భయ్" అని మేకర్స్ తెలంగాణ యాసలో చెప్పడం అట్రాక్షన్ గా నిలిచింది. పోస్టర్ బట్టి చూస్తే ఈ మూవీ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రంలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ భేరిగా తెలిపారు మేకర్స్. ఆయన రోల్ ను కాస్త క్రేజీగా పరిచయం చేశారు. ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. "ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్య పూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో" అంటూ రవితేజ రోల్ గురించి పోస్టర్ పై మేకర్స్ రాసుకొచ్చిన తీరు భలే ఉంది. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే.. ఈ సినిమా పెద్ద దావత్ లా ఉండబోతున్నట్లు అర్ధమవుతోందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మూవీపై ఆసక్తి నెలకొందని చెబుతున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా రవితేజ ల్యాండ్ మార్క్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Tags:    

Similar News