అభిమాని హత్య: పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదు!
ఈ కేసులో హత్యకు ప్రేరేపించినందున ఏ-1 గా పవిత్ర, హత్యకు కథ నడిపించినందున ఏ-2గా దర్శన్ పేర్లను చేర్చారు.
కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ అభిమానిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన పవిత్ర గౌడ కేవలం దర్శన్ కి సహనటి మాత్రమేనని.. అతడి భార్య కాదని దర్శన్ తరపు న్యాయవాది అనిల్ బాబు తాజా ప్రకటనలో స్పష్టం చేశారు. చిత్రదుర్గ నివాసి, దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామి (33)ని హత్య చేసిన ఆరోపణలపై దర్శన్, అతడి స్నేహితురాలు (కన్నడ మీడియాలో ప్రియురాలు, రెండో భార్య అన్న ప్రచారం ఉంది) పవిత్ర గౌడ, మరో 14 మందిని ఈ వారం ప్రారంభంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో హత్యకు ప్రేరేపించినందున ఏ-1 గా పవిత్ర, హత్యకు కథ నడిపించినందున ఏ-2గా దర్శన్ పేర్లను చేర్చారు.
రేణుకాస్వామి దర్శన్‌కు వీరాభిమాని అని, పవిత్ర గౌడను కించపరిచేలా సోషల్ మీడియాలో మెసేజ్‌లు షేర్ చేయడం వల్లనే ఈ హత్య జరిగిందని ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలింది. బాధితుడిని కిడ్నాప్ చేసి బెంగళూరు లోని ఓ షెడ్‌లో ఉంచి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశారు.
శనివారం అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో దర్శన్‌ను సందర్శించిన అనంతరం అతడి లాయర్ అనిల్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ.. దర్శన్‌ను అరెస్టు చేసిన తర్వాత రెండుసార్లు కలిశాను. నేను దర్శన్‌కి అతని భార్య, అత్తమామలు, కుటుంబ సభ్యుల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పవిత్ర గౌడను దర్శన్ భార్యగా మీడియాలోని కొన్ని వర్గాలు ప్రొజెక్ట్ చేయడంపై ఆయన భార్య విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఆమె బయటికి కూడా వెళ్ళరు! అని అన్నారు.
అనిల్ బాబు ప్రకారం.. విజయలక్ష్మి మీడియాకు, కర్ణాటక ప్రజలకు తాను మాత్రమే చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య (దర్శన్) అని, తాను తప్ప మరెవరూ భార్యగా లేరని స్పష్టం చేయాలనుకుంటున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. పవిత్ర గౌడ దర్శన్‌కి కో ఆర్టిస్ట్.. మంచి స్నేహితురాలు మాత్రమే. వారి మధ్య ఎటువంటి సంబంధం లేదు! అని లాయర్ అన్నారు. పవిత్ర గౌడను దర్శన్ భార్య అని పోలీసులు, అధికారులు సంబోధించడంపై అనీల్ బాబును అడిగినప్పుడు వారు పొరపాటున అలా చేశారని చెప్పారు.
పవిత్ర గౌడ దర్శన్ భార్య అని నిరూపించే రికార్డు లేదు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటే కొన్ని డాక్యుమెంట్లు ఉండాల్సి ఉంటుంది.. కానీ ఆమె దర్శన్ భార్య అని చూపించడానికి ఎలాంటి ఆధారాలు లేదు! అని అనిల్ బాబు అన్నారు. దర్శన్ ఒకరిని మాత్రమే వివాహం చేసుకున్నాడు.. అది విజయలక్ష్మి! అన్నారాయన. పోలీసు కస్టడీలో ఉన్న దర్శన్ పరిస్థితి గురించి న్యాయవాది అడిగినప్పుడు ``అతడు బాగానే ఉన్నాడు. దర్శన్‌కు భుజం.. చీలమండలో నొప్పి ఉంది``అని అన్నారు. దర్శన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఇప్పటికే మీడియాలు కథనాలు వేస్తూ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాయి. ఇది సరికాదు.. అవసరమైన పత్రాలను పొందిన తర్వాత తగిన సమయంలో మేము సెషన్స్ కోర్టు ముందు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తాము అని లాయర్ అనీల్ తెలిపారు.
దర్శన్- పవిత్ర గౌడల సంబంధంపై గతం గురించి ప్రస్థావిస్తే.. దర్శన్ తో తన 10 సంవత్సరాల అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకున్నప్పటి పవిత్ర సోషల్ మీడియా పోస్టులు మాత్రమే ఆధారంగా ఉన్నాయి. డాక్యుమెంట్ పూర్వకంగా వారి బంధానికి సంబంధించిన ప్రూఫ్‌లు ఏవీ లేవు. పవిత్ర తన కుటుంబాన్ని నాశనం చేసిందని, తాను గృహహింసకు గురయ్యానని దర్శన్ భార్య విజయలక్ష్మి ఇంతకుముందు దర్శన్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. పవిత్రతో దర్శన్ సాన్నిహిత్యాన్ని కట్టుకున్న భార్య విజయలక్ష్మి బహిరంగంగా తీవ్రంగా వ్యతిరేకించింది.
దర్శన్ అభిమాని రేణుకాస్వామి తొలి నుంచి దర్శన్ భార్య విజయలక్ష్మికి మద్దతుగా నిలిచారు. అతడు పవిత్ర గౌడకు అవమానకరమైన సందేశాలను పంపడానికి కారణం ఈ వ్యతిరేకత. అది అతడి దారుణ మరణానికి దారితీసింది.