బిగ్ ఇష్యూ... పవన్ పై రేణు సంచలన వీడియో!

ఇదే సమయంలో తమ పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలనూ రాజకీయాల్లోకి, సినిమా వివాదాల్లోకి లాగొద్దని ఆమె సూచించారు.

Update: 2023-08-10 12:14 GMT

పవన్‌ కల్యాణ్‌ తనకు వ్యక్తిగతంగా చేసిన ద్రోహం సంగతి కాసేపు పక్కనపెడితే... వ్యక్తిగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ అరుదైన వ్యక్తి అని ప్రకటించారు ఆయన మాజీ భార్య, నటి రేణూ దేశాయ్. ఈ మేరకు ఆమె ఇన్‌ స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు.

అవును... పవన్ కల్యాణ్ పైనా, బ్రో సినిమా వివాదంపైనా, పవన్ సామాజిక బాధ్యతపైనా, తనకు జరిగిన పర్సనల్ అన్యాయంపైనా రేణూదేశాయ్ స్పందించారు. ఇదే సమయంలో తమ పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలనూ రాజకీయాల్లోకి, సినిమా వివాదాల్లోకి లాగొద్దని ఆమె సూచించారు.

"ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌ పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు" అంటూ వీడియో స్టార్ట్ చేశారు రేణూ దేశాయ్!

ఈ సమయంలో.. "ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి యాక్టర్, పొలిటీషియన్. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి" అని రేణూ దేశాయ్ అన్నారు.

అనంతరం... "నా మాజీ భర్తకు మద్దతుగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చాలామందికి అర్థంకాకపోవచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఆయన నాకు అన్యాయం చేశారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అది నా వ్యక్తిగతం" అని చెప్పిన రేణు.. అనంతరం పవన్ వ్యక్తిగతంగా మంచోడని తెలిపింది.

అవును... "ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన చాలా అరుదైన వ్యక్తి. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బుపై ఆయనకు ఆసక్తి లేదు. సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటాడు" అని స్టేట్ మెంట్ ఇచ్చారు రేణూ దేశాయ్!

ఇదే సమయంలో పవన్ రాజకీయాలపై రేణూ దేశాయ్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆయన సక్సెస్ ఫుల్ హీరో. కావాలంటే సినిమాల్లో కొనసాగవచ్చు. కావాల్సినంత క్రేజ్, డబ్బు వస్తుంది. కానీ ఆయన రాజకీయాలు ఎంచుకున్నాడు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టాడు" అని అన్నారు.

అనంతరం... "ఆయన దగ్గర నేను లేకపోయినా, ఆయన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆయన రాజకీయంగా నిజాయితీగా ఉన్నారు. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ చెబుతున్నాను.. ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. నేను ఆయన మాజీ భార్యగా చెప్పడం లేదు.. సమాజానికి చెందిన ఓ పౌరురాలిగా చెబుతున్నాను" అని ముగించారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కు మద్దతుగా రేణు దేశాయ్, ఇలా తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది!

Tags:    

Similar News