ఛత్రపతిగా 'కాంతార' హీరో.. ఫస్ట్ లుక్ అదుర్స్!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఇప్పటికే బోలెడన్ని సినిమాలు తెరకెక్కాయి.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఇప్పటికే బోలెడన్ని సినిమాలు తెరకెక్కాయి. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ టైటిల్ రోల్ లో 'రాజా శివాజీ' అనే టైటిల్ తో ఈ ఏడాదిలోనే ఓ సినిమా ప్రారంభమైంది. రితేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి జెనీలియా నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా శివాజీ కథతో మరో కొత్త సినిమా ప్రకటించబడింది. ''ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్'' అనే పేరుతో ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది.
'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రిషబ్ శెట్టి టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ నాచ్ టెక్నిషియన్స్, స్టార్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. 2027 రిపబ్లిక్ డే వీక్ లో జనవరి 21న గ్లోబల్ వైడ్ గా మల్టీ లాంగ్వేజెస్ లో ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఛత్రపతి శివాజీ అవతార్ లో రిషబ్ శెట్టి ఆకట్టుకున్నారు. వీరశివాజీ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయాడని ఈ ఒక్క పోస్టర్ చూసే చెప్పొచ్చు.
''మన గౌరవం, భారతదేశపు గ్రేటెస్ట్ వారియర్ కింగ్ - ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఎపిక్ సాగాను తెర మీదకు తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన, మొఘల్ సామ్రాజ్యం యొక్క శక్తిని సవాలు చేసిన, ఎప్పటికీ మరచిపోలేని వారసత్వాన్ని సృష్టించిన ఒక యోధుని గౌరవించటానికి చేస్తున్న ఒక యుద్ధ నినాదం ఇది. మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా కోసం సిద్ధంగా ఉండండి. ఎవరికీ తెలియని ఛత్రపతి శివాజీ మహారాజ్ కథని మేము చెప్పబోతున్నాం. ఇంతకముందెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నాం. హర హర మహాదేవ'' అని మేకర్స్ పేర్కొన్నారు.
'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. తన స్వీయ దర్శకత్వంలో కేవలం రూ. 16 కోట్లతో తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమా సుమారుగా 50 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ సినిమానే ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తెచ్చిపెట్టింది. అయితే 'కాంతారా'తో వచ్చిన క్రేజ్ ను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, కెరీర్ ను ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నాడు రిషబ్. క్రేజీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకుంటూ పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ను విస్తరించుకుంటున్నాడు.
రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతారా' ప్రీక్వెల్ గా ‘కాంతార - ఎ లెజెండ్: ఛాప్టర్ 1’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే 'హనుమాన్' సీక్వెల్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న 'జై హనుమాన్' మూవీలో రిషబ్ నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తీస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరాఠా వీరుడు శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న ''ఛత్రపతి శివాజీ మహారాజ్'' చిత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలు రాబోయే మూడేళ్ళలో రిలీజ్ కాబోతున్నాయి. ఇవి ఏ హీరోకైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాల తర్వాత రిషబ్ శెట్టి కెరీర్ ఎలా మారుతుందో చూడాలి.