మినీ రివ్యూ: 'శబరి'

మరి ఈ సినిమా కథేంటి? ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందో పబ్లిక్ టాక్ ని బట్టి తెలుసుకుందాం.

Update: 2024-05-03 11:43 GMT

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వైవిధ్యభ‌రిత‌మైన పాత్ర‌లతో తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ పాత్రలే కాదు, అవకాశం వచ్చినప్పుడు లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పిస్తోంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న వరు.. ఇప్పుడు ‘శబరి’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సైక‌లాజిక‌ల్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ఈరోజు (మే 3) శుక్రవారం రిలీజయింది. మరి ఈ సినిమా కథేంటి? ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందో పబ్లిక్ టాక్ ని బట్టి తెలుసుకుందాం.

కథేంటంటే: చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన సంజ‌న (వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌).. కాలేజీ రోజుల్లో అర‌వింద్ (గ‌ణేష్‌ వెంక‌ట్రామ‌న్‌) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీరికి రియా(బేబీ నివేక్ష) అనే కూతురు కూడా ఉంటుంది. భర్త మోసం చేయ‌డంతో సంజ‌న తన కుమార్తెను తీసుకొని ముంబ‌యి నుంచి వైజాగ్‌కు వ‌చ్చేస్తుంది. నగర శివార్లలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ, త‌న కాలేజీ ఫ్రెండ్ రాహుల్ (శ‌శాంక్‌) సహాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్‌గా జాబ్ లో జాయిన్ అవుతుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆమె లైఫ్ లోకి సైకో సూర్యం (మైమ్ గోపి) ఎంటర్ అవుతాడు. రియా త‌న కూతురని, తన బిడ్డ‌ని అప్ప‌గించాల‌ని ఆమె వెంట‌పెడతాడు. మ‌రోవైపు అర‌వింద్ కూడా త‌న కూతురు కోసం కోర్టుకు వెళ్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? సైకో సూర్యంకి రియాకి ఉన్న సంబంధమేంటి? కూతుర్ని కాపాడుకునేందుకు సంజ‌న ఏం చేసింది? రియాని సంజన కాపాడుకుంటుందా లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కుమార్తెను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్లే తల్లి కథే 'శబరి'. దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ పేరు శబరి కాదు. రాముడు కన్న కొడుకు కాకపోయినా శబరి ఆయన మీద ఎంతో ప్రేమ, వాత్సల్యం చూపించింది. అలాంటి ప్రేమే ఇక్కడ వరు పాత్రకు ఉండటంతో అలాంటి టైటిల్ పెట్టినట్లు మేకర్స్ ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చారు. ఇక్కడ బిడ్డ కోసం తల్లి చేసే పోరాటాన్ని ద‌ర్శ‌కుడు ఓ సైక‌లాజిక‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కించే ప్ర‌య‌త్నం చేసారు. క‌థ‌లో బలమైన సంఘ‌ర్ష‌ణ‌, భావోద్వేగాలు లేకపోవడం.. స్క్రీన్‌ప్లే పేల‌వంగా ఉండటం మైనస్ గా మారిందని టాక్ ని బట్టి తెలుస్తోంది. కొన్ని ట్విస్ట్‌లు మాత్రం థ్రిల్ కు గురి చేసినట్లుగా ప్రేక్షకులు చెబుతున్నారు.

ఫస్టాఫ్ ప్రారంభంలో నెమ్మదిగా సాగే సన్నివేశాలతో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే సూర్యం నుంచి త‌ప్పించుకునే ప్రయత్నాల్లో సంజనకు ఎదుర‌య్యే ప‌రిస్థితులు థ్రిల్‌కు గురి చేస్తున్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. అయితే ద్వితీయార్ధంలో కథ‌నమంతా గాడిత‌ప్పినట్లుగా అనిపిస్తుంది. సినిమాని ముగించిన తీరు కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదని అంటున్నారు. దర్శకుడు కొత్త పాయింట్ తీసుకున్నా, దాన్ని ఆడియన్స్ ను ఆకట్టుకునే థ్రిల్ల‌ర్‌గా మ‌ల‌చుకోవ‌డంలో త‌డ‌బడ్డాడని తెలుస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్ లో వైజాగ్ అని చూపించి, హైదరాబాద్ లోని మాల్స్, ఏరియాలు చూపించినట్లుగా ఆడియన్స్ పేర్కొంటున్నారు.

అయితే సినిమాలో సింగిల్ మ‌ద‌ర్‌ పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ తన స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో మరోసారి ఆమెలోని వెర్సటాలిటీని చూపించినట్లు తెలుస్తోంది. ప్రేమ, పోరాటం, ఆవేదన.. ఇలా అన్నిటినీ సంజన పాత్రలో చక్కగా పలికించింది. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది. కథలో బ‌లం లేకున్నా సినిమా మొతాన్ని త‌న భుజాల‌పై మోసే ప్ర‌య‌త్నం చేసింది. సైకో సూర్యం పాత్రకు మైమ్ గోపి న్యాయం చేసారు. గ‌ణేశ్‌ వెంక‌ట్రామ‌న్‌, శశాంక్, నివేక్ష‌ తమ ప‌రిధి మేర‌కు నటించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. గోపీ సుంద‌ర్ బ్యాగ్రౌండ్ స్కోర్, రాహుల్ శ్రీవాత్సవ సినిమాటోగ్రఫీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయని అంటున్నారు. ఓవరాల్ గా టాక్ ప్రకారం ‘శబరి’ సినిమా ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏవిధంగా పెరఫార్మ్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News