స్టార్ హీరో మూవీ కోసం 20 ఏళ్ల కుర్ర కంపోజర్
తమిళ్ స్టార్ హీరో సూర్య ఇటీవల కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
తమిళ్ స్టార్ హీరో సూర్య ఇటీవల కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మించిన కంగువా సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కంగువా సినిమా దాదాపుగా రూ.130 కోట్ల నష్టంతో బాక్సాఫీస్ రన్ క్లోజ్ అయ్యింది. ఆ సినిమా ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చిన సూర్య కొత్త సినిమాను ఆర్జే బాలాజీతో చేసేందుకు రెడీ అవుతున్నారు. గతంలోనే ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ఆరు నెలల్లోనే సినిమాను పూర్తి చేసే విధంగా ఆర్జే బాలాజీ ప్లాన్ చేస్తున్నారు.
సూర్య45గా రూపొందబోతున్న ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా బాలాజీ అనుకున్నాడు. సూర్య సైతం రెహమాన్ పట్ల ఆసక్తి చూపించారు. కానీ సినిమాను చాలా స్పీడ్‌గా పూర్తి చేసి, విడుదల చేయాలి అనే ఉద్దేశ్యంతో ఉన్న దర్శకుడు బాలాజీ కొత్త సంగీత దర్శకుడితో వర్క్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే రెహమాన్‌ను తప్పించి 20 ఏళ్ల యువ సంచలనంగా పేరున్న యువ కంపోజర్ సాయి అభ్యంకర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఈ విషయాన్ని తమిళ మీడియా వర్గాల వారు దృవీకరించడంతో పాటు, ఈ కాంబో గురించి ప్రముఖంగా చర్చిస్తున్నారు.
ఈ 20 ఏళ్ల యువ సంగీత దర్శకుడు కత్తి సెరాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈయన సంగీత సారధ్యంలో సినిమాలు ఏమీ రాలేదు. కేవలం ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్స్ మాత్రమే వచ్చాయి. అయినా ఈయనకు వరుసగా రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే రాఘవ లారెన్స్ యొక్క బెంజ్ సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం దక్కింది. బెంజ్ ఇంకా విడుదల కాకుండానే అప్పుడే సూర్య45 సినిమాకు ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈమధ్య కాలంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకులు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో సాయి అభ్యంకర్ ఎలాంటి ఫలితాలను చవి చూస్తాడు అనేది చూడాలి.
లారెన్స్, సూర్య సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని, హిట్ ఆల్బమ్స్‌లను అందిస్తే కచ్చితంగా ఆయన డేట్ల కోసం ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ఎగబడుతారు. అనిరుధ్ రవిచంద్రన్ సైతం దాదాపుగా ఇదే ఏజ్‌లో సంగీత ప్రపంచంలో అడుగు పెట్టి ఓ ఊపు ఊపిన విషయం తెల్సిందే. అందుకే సాయి అభ్యంకర్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. స్టార్ హీరో సూర్య సినిమాకు సాయి అభ్యంకర్ ఇవ్వబోతున్న సంగీతం కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్‌లో ఇతర ఎంట్రీ కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది.