గాయాలతో ఉన్న సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటోవాలాకు రివార్డు!

దాడికి గురై.. తీవ్ర గాయాలతో ఉన్న బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటోవాలా గురించి తెలిసిందే.

Update: 2025-01-21 04:00 GMT

దాడికి గురై.. తీవ్ర గాయాలతో ఉన్న బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటోవాలా గురించి తెలిసిందే. గాయాల బారిన పడిన వేళలో ఇంట్లో కార్లు లేకపోవటం.. ఉన్న ఒక్క కారు స్టార్ట్ కాకపోవటంతో.. ఇంటి బయటకు వచ్చి ఆటోలో సైఫ్ ను ఎక్కించిన వైనం తెలిసిందే. సమయానికి దేవుడి మాదిరి రావటమే కాదు.. భయానికి గురి కాకుండా ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటోవాలాను ఒక సంస్థ సత్కరించిన వైనం తాజాగా చోటు చేసుకుంది. అదే సమయంలో డబ్బులు తీసుకునేందుకు నిరాకరించారు కూడా.

సదరు ఆటో డ్రైవర్ ను భజన్ సింగ్ రానాగా గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆటో డ్రైవర్ ను సైతం పోలీసులు విచారించటం.. సమాచారం తెలుసుకోవటం తెలిసిందే. తీవ్రంగా గాయాల బారిన పడిన సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలో ఏం జరిగిందో సదరు ఆటో డ్రైవర్ చెబుతూ.. ‘‘నేను రాత్రిళ్లు ఆటో నడుపుతుంటాను. సైఫ్ పై దాడి జరగ్గానే ఒక మహిళ బిగ్గరగా అరిచి నా ఆటోను ఆపింది. ఆ టైంలో సైఫ్ అలీఖాన్ వేసుకున్న వైట్ కుర్తా మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంది. ఆ టైంలో ఆటోలో ఎక్కింది సైఫ్ అని కూడా తెలీదు. సైఫ్ తో పాటు అతడి ఇద్దరు కొడుకులు కూడా ఆటో ఎక్కారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కానీ నేను ఎక్కించుకున్నది సైఫ్ అలీ ఖాన్ అని తెలీదు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత.. అక్కడి సిబ్బందికి తాను సైఫ్ అలీఖాన్ అని చెప్పమని చెప్పటంతోనే ఆ విషయం తెలిసింది. వారి నుంచి ఛార్జీలు తీసుకోకుండానే వచ్చేశాను’’ అంటూ సదరు ఆటో డ్రైవర్ వెల్లడించారు.

అంతేకాదు.. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదంటూ తన వైఖరిని వెల్లడించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడున్న పిరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటారా? అన్న మాటలు పలువురి నోటి నుంచి వస్తున్నాయి. ఆటో డ్రైవర్ తీరును.. అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్న ఒక సంస్థ భజన్ సింగ్ రానాకు రూ.11 వేల రివార్డును ప్రకటించటమే కాదు.. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శాలువా కప్పి.. రూ.11వేల రివార్డును అందజేశారు. ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ స్పందించిన విధానం పలువురిని బాగా ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News