పవన్ రికార్డ్‌కి 'సలార్‌' ఎసరు పెట్టేనా?

కేజీఎఫ్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున వసూళ్లు రాబట్టింది.;

Update: 2025-03-18 10:00 GMT

ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో వచ్చిన 'సలార్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా సినిమాకు నార్త్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2023లో విడుదలైన సలార్‌ సినిమా తక్కువ సమయంలోనే రీ రిలీజ్‌కి సిద్ధం అయింది. ప్రభాస్ అభిమానులతో పాటు, ప్రశాంత్‌ నీల్‌ అభిమానులు సలార్‌ రీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈమధ్య కాలంలో రీ రిలీజ్‌లు అనేవి కామన్‌ అయ్యాయి. అయితే విడుదలైన పది ఇరవై ఏళ్లు అయిన సినిమాలకు మాత్రమే రీ రిలీజ్‌ చూశాం. కానీ సలార్ సినిమా విడుదలై సరిగ్గా రెండేళ్లు కూడా కాకుండానే రీ రిలీజ్‌కి రెడీ అయింది. మొన్నటి వరకు ఓటీటీలో టాప్‌లో ట్రెండ్‌ అవుతూ వచ్చిన సలార్‌ సినిమాను థియేటర్‌, ఓటీటీ, టీవీల్లో అత్యధికులు చూశారు. ఇలాంటి సమయంలో సలార్‌ రీ రిలీజ్ ఏంటి విడ్డూరం కాకుంటే అంటూ పలువురు పెదవి విరిచారు. కానీ సలార్‌ సినిమాకు ఉన్న బజ్‌, క్రేజ్ నేపథ్యంలో రీ రిలీజ్‌కి రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు కాబోతున్నాయి అంటూ అడ్వాన్స్ బుకింగ్‌ వసూళ్లను చూస్తూ ఉంటే అనిపిస్తుంది. రీరిలీజ్‌కి మూడు రోజుల సమయం ఉండగానే అప్పుడే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది.

మార్చి 21న గ్రాండ్‌గా రీ రిలీజ్ కాబోతున్న సలార్‌కి నమోదు అవుతున్న అడ్వాన్స్‌ బుకింగ్‌ షాకింగ్‌గా ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్ గబ్బర్‌ సింగ్‌ రీ రిలీజ్‌లో దాదాపు రూ.5 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు సలార్‌ సినిమా రీ రిలీజ్ వసూళ్లు గబ్బర్‌ సింగ్‌ సినిమా రీ రిలీజ్ వసూళ్లను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. విడుదల సమయం వరకు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్‌లో సినిమాకు మరో రెండు నుంచి మూడు కోట్ల వసూళ్లు నమోదు అయితే ఈజీగానే సలార్‌ కి రూ.5 కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్‌ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు సలార్‌ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్‌ షూటింగ్‌ సమయంలోనే సెకండ్‌ పార్ట్‌ షూటింగ్ కొంత మేరకు పూర్తి చేశారు. బ్యాలన్స్ వర్క్‌ కోసం ఆ మధ్య షూటింగ్‌ ప్రారంభం అయింది. కానీ ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్టీఆర్‌ సినిమాను విడుదల చేయాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నాడు. దాంతో ఎన్టీఆర్‌ మూవీ విడుదలైన తర్వాతే సలార్‌ 2 సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సలార్‌ మొదటి పార్ట్‌తో పోల్చితే సలార్‌ 2 లో హై ఓల్టేజ్ యాక్షన్‌ సీన్స్ ఉండబోతున్నాయి అని మేకర్స్‌తో పాటు నటీనటులు చెబుతున్నారు. సినిమా మెయిన్‌ కథ మొత్తం సలార్‌ 2లోనే ఉంది. ఎన్నో ప్రశ్నలకు సలార్‌ 2 సమాధానం చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News