సంక్రాంతి సినిమాలు.. సలారే డిసైడ్ చేయాలి
సలార్ రిలీజ్ టైమ్ ఆధారంగానే ప్రభాస్ నటించిన మరో చిత్రం కల్కి రిలీజ్ డేట్ కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది
తెలుగు చిత్ర సీమకు సంక్రాంతి పెద్ద సీజన్. ఒకే సారి మూడు నాలుగు చిత్రాలు ముగ్గుల పండక్కి వచ్చినా.. సినిమా బాగుంటే చాలు ఆదరించి ఆశీర్వదిస్తుంటారు ప్రేక్షక దేవుళ్లు. సినిమా మరింత కాస్త ఎక్కువ బాగుంటే.. కాసుల వర్షమే. అందుకే ఈ ముగ్గుల పండగ బరిలో.. బాక్సాఫీస్ ముందు అదరగొట్టేందుకు స్టార్ హీరోలతో పాటు యువ కథానాయకులు ఉవ్విళ్లూరుతుంటారు. అలానే ఈ సీజన్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవడం కోసం చాలా కాలం ముందు నుంచే ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ ప్రతీసారి ఈ సీజన్ కోసం ముందుగా ఎన్ని సినిమాలు కర్చీఫ్ లు వేసిన.. . తీరా ఆ సమయానికి కొంతమంది వెనక్కి తగ్గడం, రేసులోకి కొత్త వారు రావడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2024 సంక్రాంతిలోనూ ఇదే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలు రాబోయే ముగ్గుల పండక్కి దాదాపు అరడజను సినిమాలు బెర్త్ లు ఖరారు చేసుకున్నాయి. మహేశ్‌బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ, తేజ సజ్జా హను-మాన్‌తో పాటు విజయ్ దేవరకొండ - పరశురామ్ చిత్రాలు ఈ సంక్రాంతికే రిలీజ్ ను ఇప్పటికే కన్ఫామ్ చేసుకున్నాయి. అలాగే ప్రభాస్ కల్కి కూడా ఈ పండగ లక్ష్యంగానే రెడీ అవుతున్నాయి. వీటిలో హనుమాన్ తప్ప మిగతా వన్నీ కూడా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. మరి ముగ్గుల పండగకి ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరి ఆలోగా తమ షూటింగ్ లను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యే సినిమాలు ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
అదే సమయంలో ఇప్పుడంతా ఇండస్ట్రీలో సలార్ రిలీజ్ డేట్ కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నెల చివర్లో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ముందున్న పండగలన్నీ కూడా ఇప్పటికే మిగతా సినిమాల రిలీజ్ డేట్ లతో భర్తీ అయిపోయాయి. ఒకవేళ ఏదో ఒక పండగనే లక్ష్యంగా సలార్ బరిలోకి దిగితే.. మిగిలిన చిత్రాల రిలీజ్ డేట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న హీరోల సినిమాలే కాదు, పెద్ద హీరోల సినిమా రిలీజ్ డేట్లు కూడా.
సలార్ రిలీజ్ టైమ్ ఆధారంగానే ప్రభాస్ నటించిన మరో చిత్రం కల్కి రిలీజ్ డేట్ కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సలార్ సినిమా.. వచ్చే సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ చిత్రం నిజంగానే ముగ్గుల పండక్కి వస్తే.. అప్పటికే ఆ పండక్కి బెర్త్ లు ఖరారు చేసుకున్న ఏ సినిమాలు తప్పుకుంటాయో..
ఏదిఏమైనా.. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాల కన్నా ఎక్కువ విడుదలయ్యే అవకాశం ఉండదు. అదే సమయంలో ఇతర భాషల సినిమాలు ఇక్కడ సందడి చేస్తాయి. కాబట్టి ఈ పరిణామాలన్నిటి మధ్య చివరికి ఏ సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయో కాలమే నిర్ణయించాలి.