సలార్.. సండే అంతకుమించిన సునామీ
ఇంకో రోజులో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. సోమవారం క్రిస్మస్ హాలీడే, మంగళవారం హాఫ్ డే కనుక ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశముంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్- పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం దుమ్మురేపే కలెక్షన్లతో సత్తా చాటుతోంది. 2023లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా నిలిచిన సలార్.. రెండో రోజూ జోరు కొనసాగించింది. ఇప్పుడు మూడో రోజు.. సెకెండ్ డే కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.176 కోట్ల గ్రాస్ సాధించిన సలార్.. రెండో రోజు రూ.119 కోట్లను సాధించింది. మూడు రోజులు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో రోజులో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. సోమవారం క్రిస్మస్ హాలీడే, మంగళవారం హాఫ్ డే కనుక ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశముంది.
నైజాంలో కూడా సలార్ మూవీ దుమ్ముదులిపేస్తోంది. భారీ వసూళ్లను రాబడుతోంది. నైజాంలో ఈ సినిమా మూడో రోజు రూ.11.20 కోట్లకుపైగా వసూలు చేసింది. మూడు రోజుల కలిపి ఈ మూవీ రూ.44.80 కోట్లకుపైగా షేర్ సాధించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. నైజాంలో ఈ సినిమాను విడుదల చేసింది.
సలార్ చిత్రంలో ప్రభాస్‍ను యాక్షన్ అవతారంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించడంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ప్రభాస్ కటౌట్‍కు ఇది సరైన సినిమా అని ప్రశంసిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత డార్లింగ్ స్థాయికి తగ్గ బ్లాక్‌బాస్టర్ వచ్చేసిందని ఖుషీ అవుతున్నారు. రిపీట్ మోడ్ లో థియేటర్లకు వెళ్లి సినిమా చూసేస్తున్నారు.
సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన పాత్ర చేశారు. ప్రాణ స్నేహితులుగా ఉండే వీరు బద్ద శత్రువులుగా ఎలా మారారనే విషయంపై ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.