గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపుతో స్టార్ హీరో కొత్త‌ బుల్లెట్ ప్రూఫ్ కార్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-19 05:46 GMT

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలిగా అత‌డి స్నేహితుడు సిద్ధిఖ్ ని చంపేయ‌డంతో ఇప్పుడు స‌ల్మాన్ కుటుంబం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంది. స‌ల్మాన్, అత‌డి ఇంటి చుట్టూ హైసెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.

మునుప‌టిలా కాకుండా ఈసారి స‌ల్మాన్ ఈ విష‌యాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. గ్యాంగ్ స్ట‌ర్ నుంచి ముప్పు పొంచి ఉండ‌టంతో చాలా కాలంగా కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో స్వ‌యంగా భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసుకుంటున్న స‌ల్మాన్ ఖాన్ ఇప్ప‌టికే ప‌లుమార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్ల‌ను కొనుగోలు చేసారు. అయితే అత‌డికి ఇప్పుడు పాత బుల్లెట్ ప్రూఫ్ కార్ల‌పై అత‌డికి న‌మ్మ‌కం లేదు. అందుకే ఖ‌రీదైన మ‌రో కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కొనుగోలు చేసాడు. సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాలీవుడ్ సొసైటీ నివేదిక ప్రకారం.. సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. భారత మార్కెట్లో ఈ కారు అందుబాటులో లేనందున దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. కారు ధర ట్యాగ్ సుమారు రూ.2 కోట్లు. ఈ కారును త్వరగా భారతదేశానికి తీసుకురావడానికి భారీ మొత్తం ఖర్చు చేస్తున్నాడ‌ని స‌మాచారం.

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కారు స్పెసిఫికేషన్‌ల ప్రకారం..నిస్సాన్ ఎస్‌.యు.వి అనేక అధునాతన భద్రతా ఏర్పాట్ల‌ను కలిగి ఉంది. పేలుడు హెచ్చరిక సూచికలు, పాయింట్-బ్లాంక్ బుల్లెట్ షాట్‌లను నిరోధించడానికి మందపాటి గాజు షీల్డ్‌లు, డ్రైవర్ లేదా ఇన్ సైడ్ ఉన్న‌ ప్రయాణీకులను గుర్తించకుండా మ‌భ్య పెట్టే బ్లాక్ షేడ్స్ వ‌గైరా ఏర్పాటు ఉంది. సల్మాన్‌కు గత ఏడాది కూడా యూఏఈ నుంచి బుల్లెట్‌ప్రూఫ్ కారును కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న సంగ‌తి విధిత‌మే. ఇప్పుడు రెండోసారి గల్ఫ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసాడు. తనకు త‌న తండ్రి సలీం ఖాన్‌కు మొదటిసారిగా బిష్ణోయ్ గ్యాంగ్ నుండి హత్య బెదిరింపులు వచ్చాయి. అప్ప‌టి నుంచి ఈ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసుకుంటున్నాడు.

బిగ్ బాస్ సెట్స్‌పై కట్టుదిట్టమైన భద్రత

సల్మాన్ ఖాన్ భారీ భద్రత మధ్య శుక్రవారం బిగ్ బాస్ 18 షూటింగ్‌కు తిరిగి వచ్చారు. బాబా సిద్ధిక్ హత్యకు గురైన తర్వాత అతడు గత వారం రోజుల్లో తిరిగి పనిలోకి రావడం ఇదే మొదటిసారి. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ సిద్ధిక్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్య‌త‌ను తీసుకుంది. శుక్రవారం నాడు.. ముంబై పోలీసుల వాట్సాప్ నంబర్‌కు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. స‌ల్మాన్ రూ.5 కోట్లు చెల్లించాలని దుండ‌గులు అడిగారు. ``దీన్ని తేలికగా తీసుకోకండి.. సల్మాన్ ఖాన్ సజీవంగా ఉండాలనుకుంటే లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వాన్ని ముగించాలనుకుంటే అతడు రూ.5 కోట్లు చెల్లించాలి. డబ్బులు ఇవ్వకుంటే సల్మాన్‌ ఖాన్‌ పరిస్థితి బాబా సిద్ధిక్‌ కంటే దారుణంగా ఉంటుంది``’ అని సంక్షిప్త సందేశంలో రాసి ఉంది. దీంతో బిగ్ బాస్ సెట్‌లో అనేక కఠినమైన భద్రతా చర్యలు అమల్లోకి వచ్చాయి. 60 మందికి పైగా సిబ్బంది స‌ల్మాన్ ని కాపాడేందుకు ఆ ప్రాంతాన్ని మోహరించారు. కాంపౌండ్‌కి యాక్సెస్ కూడా పరిమితం చేసారు. ఖాన్ ఉన్న‌ కాంపౌండ్‌లోకి ఎవరినైనా అనుమతించే ముందు ఆధార్ కార్డును తనిఖీ చేయాలని గార్డులకు చెప్పారు. సల్మాన్ వారాంతపు స్పెషల్ వీకెండ్ క వార్ ఎపిసోడ్‌లను హోస్ట్ చేస్తున్నాడు.

Tags:    

Similar News