సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన నటనతోనే కాకుండా యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో కూడా అదరగొడుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన నటనతోనే కాకుండా యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో కూడా అదరగొడుతుంది. సమంత గతేడాది రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్‌సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ సీరిస్ లో సమంత తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‌నే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా మాయ చేసింది.
ఈ సిరీస్ కోసం సమంత మొదటిసారి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు గానూ తాజాగా సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ సిరీస్ కు బెస్ట్ వెబ్ సిరీస్ గా కూడా అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ డీకే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
ఈ వెబ్ సిరీస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేశారని, అవార్డుల రూపంలో అందరూ చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ ఋణపడి ఉంటానని డీకే తెలిపాడు. డీకే పోస్ట్ తో ఈ విషయం వైరల్ అవడంతో సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు రావడంపై అందరూ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.
ఇక సిరీస్ లో సమంత తన నటనతో అందరినీ కట్టిపడేసింది. సిటాడెల్ కోసం సమంత ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. సమంత పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని అటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా సమంత పలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కెరీర్ పరంగా మాత్రం సామ్ సక్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తుంది.
టాలీవుడ్ లో సమంత నుంచి తెలుగులో ఆఖరిగా వచ్చిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండతో చేసిన ఆ సినిమా యావరేజ్ అనిపించుకుంది. అప్పట్నుంచి సమంత తెలుగులో మరో సినిమాను ఒప్పుకుంది లేదు. గతేడాది సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది కానీ అప్పట్నుంచి దాని గురించి మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం సమంత రక్త్ బ్రహ్మాండ్ అనే హిందీ ప్రాజెక్టులో నటిస్తోంది.