సరిపోదా శనివారం… లెక్క పెరుగుతోంది

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా గురువారం రిలీజ్ అయ్యింది.

Update: 2024-08-30 04:30 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా గురువారం రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడం విశేషం. నాని మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే విలన్ గా చేసిన ఎస్ జె సూర్య కూడా నానికి పోటీగా నటించి మెప్పించాడని అంటున్నారు.

వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ ప్రేక్షకులకి కావాల్సినంత కిక్ ఇచ్చిందనే మాట వినిపిస్తోంది. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నాని సినిమాలు ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేందుకు వీలుగా ఉంటాయి. మాస్ కథాంశం అయిన కూడా కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి.

సరిపోదా శనివారం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే చిత్రంలా ఉందనే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో మూవీ మార్నింగ్ షో నుంచి నైట్ సెకండ్ షోకి వచ్చేసరికి థియేటర్స్ సంఖ్య పెరిగాయని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో బీ,సి సెంటర్స్ లలో ఆఫ్ లైన్ బుకింగ్స్ కూడా పెరిగినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే వీకెండ్ మూడు రోజులు కూడా సరిపోదా శనివారం సినిమాకి పబ్లిక్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అర్ధం అవుతోంది.

కలెక్షన్స్ పరంగా దసరా రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ ఫ్లో, ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని ఖాతాలో సరిపోదా శనివారం సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీ హిట్ అయితే నాని మార్కెట్ వేల్యూ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

తెలుగులో అయితే సరిపోదా శనివారం మంచి ఆదరణని సొంతం చేసుకుంది. మిగిలిన రాష్ట్రాలలో ప్రేక్షకులని ఏ మేరకు థియేటర్స్ వరకు ఈ చిత్రం రప్పిస్తుంది అనేది చూడాలి. నాని అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబై వెళ్లి ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. మరి ఈ సినిమా అక్కడి ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News