స్టార్ హీరో పొరుగు ఫ్లాట్ ఖాళీ చేసిన నటి.. కారణం తెలిస్తే షాక్!
పొరుగింట్లో ఉంటున్న స్టార్ హీరో కుక్క పప్పీని కరిచి చంపేసింది. ఇక అంతే తన గుండె పగిలింది.
ఆ నటికి కుక్క పిల్లలంటే మహా పిచ్చి. వాటిని ఎంతో అల్లారుముద్దుగా, ప్రేమగా పెంచుకుంటుంది. ఆలనా పాలన చూడటమే కాదు.. 24/7 వాటికి అన్నీ తానే. తనతో పాటే తింటాయి. తనతో పాటే బెడ్ పై నిదురిస్తాయి. పప్పీలు చాలా అల్లరి చేస్తాయి. అయితే అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న వాటిలో ఒక పప్పీ పిల్ల అర్థాంతరంగా ఒక హీరోగారి కుక్క కాటుకు బలైంది.
పొరుగింట్లో ఉంటున్న స్టార్ హీరో కుక్క పప్పీని కరిచి చంపేసింది. ఇక అంతే తన గుండె పగిలింది. హృదయ విదారకంగా ఏడ్చింది. అంతేనా..? ఆ హీరోని అతడి భార్యను చెడామడా తిట్టేసి గొడవకు దిగింది. అక్కడితో ఆగక స్టార్ కపుల్ తో స్నేహాన్ని కట్ చేసింది. ఉన్న ఫలంగా ఆ బంగ్లాను ఖాళీ చేసి దూరంగా అద్దె గదికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారితో మాట్లాడలేదు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో కుక్కల్ని అమితంగా ప్రేమించే ఆ నటి పేరు షీబా ఆకాష్. పేరుకు తగ్గట్టే మూగ జీవాల పెంపకం విషయంలో ఆకాశం అంత విశాలమైన హృదయం ఆమెకు ఉందని తన ఇన్ స్టా చూసి చెప్పొచ్చు. నిజానికి తన పొరుగున ఉండే సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ లకు షీబా ఎంతో సన్నిహితురాలు. వారంటే అమితమైన ప్రేమ తనకు. స్నేహితులు పైగా ఇరుగుపొరుగున నివశించారు.. ఒకే బంగ్లా కాంప్లెక్స్ లో నివసించామని షీబా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, సైఫ్ - అమృతా కుక్క అనుకోకుండా షీబా పెంపుడు కుక్కను చంపడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. వారి మధ్య సంబంధాలు తెగిపోయాయి.
పింక్ విల్లాతో ఇంటర్వ్యూలో షీబా ఈ సంఘటన తర్వాత సైఫ్ - అమృతతో మాట్లాడటం మానేశానని చెప్పింది. ఆ తర్వాత రెండు సార్లు తనను కలిసిన సైఫ్ సారీ చెప్పాడని కూడా షీబా వెల్లడించింది. కానీ తన పెంపుడు కుక్కను చంపేసినందున గుండె పగిలిపోయిందని ఆవేదన చెందింది. ''రాత్రికి రాత్రే నేను వెళ్ళిపోయాను. నేను ఇక ఇక్కడ నివసించలేనని చెప్పాను. ఇష్టమైన పెంపుడు జంతువును కోల్పోవడం అంటే సంబంధాన్ని కోల్పోయినట్లే'' అని షీబా ఆవేదన చెందింది.
ఇక గత ఇంటర్వ్యూలో సైఫ్ తో తనకు రిలేషన్ ఉందని కూడా షీబా ధృవీకరించింది. అప్పట్లో స్నేహంగా ఉండేవాళ్లం.. కానీ ఇప్పుడు లేదు! అని తెలిపింది. ఇటీవల ముంబై బాంద్రాలోని సైఫ్ కత్తిపోటు సంఘటనపైనా ఆమె స్పందించింది. ఈ ఘటనను దురదృష్టకరం అని అభివర్ణించింది. సైఫ్ బాగానే ఉన్నాడని, అతడి కుటుంబంతో అంతా బాగానే ఉందని నేను ఆశిస్తున్నాను. ఇది వినడానికి భయానకమైన విషయం. ఇది ఎవరినైనా భయపెట్టే విషయం. కేవలం అతడు మాత్రమే కాదు.. ఈ ప్రపంచానికి రక్షణ లేదనిపిస్తోందని షీబా ఆందోళన చెందారు. షీబా బాలీవుడ్ లో ప్రముఖ నటి. కథానాయికగా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించారు.