నెలకో సినిమా రెడీ చేస్తోన్న సితార
తెలుగు సినిమా రంగంలో మొన్నటి వరకు స్పీడ్ తగ్గించిన నిర్మాణ సంస్థలు ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నాయి.
తెలుగు సినిమా రంగంలో మొన్నటి వరకు స్పీడ్ తగ్గించిన నిర్మాణ సంస్థలు ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ సినిమాలు రూపొందుతోన్నాయి. ముఖ్యంగా కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం భారీ బడ్జెట్ చిత్రాలకే మొగ్గు చూపుతుండగా.. కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. అందులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి.
ఈ మధ్య కాలంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మంచి లాభాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ‘దేవర’ చిత్రాన్ని ఏపీ తెలంగాణలో పంపిణీ చేసి కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది. ఈ ఊపులోనే మరిన్ని చిత్రాలను నిర్మించేందుకు ఈ నిర్మాతలు ముందుకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు ఏకంగా నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ఒక సాధారణ ఉద్యోగి జీవితంలో డబ్బు ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అన్న కథాంశంతో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని భావించినా.. అప్పుడు వర్కౌట్ కాకపోవడంతో అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసుకున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రాల్లో ‘మ్యాడ్ స్కేర్’ మరొకటి. గతంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ అయిన ‘మ్యాడ్’ మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది. ఇందులో కూడా నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు హీరోలుగా చేస్తున్నారు. ఎక్స్‌స్ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం వచ్చే నవంబర్‌లో విడుదల కానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తున్న మరో తాజా చిత్రమే ‘మ్యాజిక్'. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చేస్తూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇలా ఈ నిర్మాణ సంస్థ నుంచి వరుసగా నాలుగు నెలల్లో నాలుగు సినిమాలు రానున్నాయి. అంటే నెలకు ఒక్క చిత్రం రాబోతుందన్న మాట. ఇలా మరే ప్రొడక్షన్ హౌస్ కూడా ఇంత వేగంగా సినిమాలు చేయడం లేదు అనే చెప్పాలి.