సౌత్ బ్లాక్ బస్టర్లు నార్త్‌లో తేలిపోవడానికి కారణం?
టాలీవుడ్ కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల హిందీ వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండటానికి కారణమేమిటి? సమస్య ఏమిటన్నది మన నిర్మాతలు డీకోడ్ చేయగలిగారా?
టాలీవుడ్ కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల హిందీ వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండటానికి కారణమేమిటి? సమస్య ఏమిటన్నది మన నిర్మాతలు డీకోడ్ చేయగలిగారా? అంటే.. క్రిటిక్స్ విశ్లేషణ ప్రకారం.. ఇది నిస్సందేహంగా ఓటీటీలతో ముంచుకొచ్చిన సమస్య అని చెబుతున్నారు. మరింతగా వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్‌లో ఈ సంవత్సరం అతిపెద్ద బ్లాక్‌బస్టర్ జైలర్ కానీ, గత సంవత్సరం బ్లాక్‌బస్టర్ విక్రమ్ కానీ హిందీలో ఏమంత పెద్ద వసూళ్లను తేలేకపోయాయి. ఈ రెండు సినిమాలు తమిళంలో అద్భుత వసూళ్లను సాధించగా, తెలుగులోను చెప్పుకోదగ్గ వసూళ్లను తెచ్చాయి. కానీ ఉత్తరాదిన మాత్రం ఆశించిన రేంజుకు చేరలేకపోయాయి.
జైలర్ - విక్రమ్ లాంటి భారీ సినిమాల హిందీ వెర్షన్ వసూళ్లను పరిశీలిస్తే సంతృప్తికరమైన ఫలితం రాలేదని అర్థమవుతోంది. నిజానికి తమిళంలో తమిళ వెర్షన్లు 100 కోట్లు వసూలు చేయగలిగితే, విస్తారమైన మార్కెట్ ఉన్న ఉత్తరాదిన కనీసం 30 కోట్ల వసూళ్లు అయినా తేలేకపోవడానికి కారణమేమిటి? అన్నది కూడా విశ్లేషించాల్సి ఉంది.
నిజానికి OTT విండో సమస్యతోనే ఈ ముప్పు. దీని కారణంగా మన పెద్ద సినిమాలు హిందీ మార్కెట్‌లో అద్భుతాలు చేయలేకపోతున్నాయని భావిస్తున్నారు. 2022లో ఉత్తరాదిన ఉన్న ఎగ్జిబిటర్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్‌లు సినిమా థియేట్రికల్ రిలీజులకు, OTT విడుదలకు మధ్య కనీసం 8 వారాల గ్యాప్ ఉండాలని తీర్మానించాయి. అయితే తమిళం - తెలుగు లో పెద్ద సినిమాలు సాధారణంగా థియేటర్లలో విడుదలైన నాలుగు నుండి ఐదు వారాల్లోనే OTTలో వచ్చేస్తున్నాయి. దీంతో హిందీ బెల్ట్‌లోని మల్టీప్లెక్స్ అసోసియేషన్లు OTT విండో గ్యాప్‌కు కట్టుబడి ఉండని చిత్రాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నాయి. అందువల్ల సౌత్ బ్లాక్ బస్టర్లు ఏవీ మల్టీప్లెక్స్‌లలో ఆడటం లేదు. ఇది ఆయా సినిమాల కలెక్షన్‌లను తీవ్రంగా దెబ్బతీసింది.
నిజానికి టాలీవుడ్‌లో చాలా కాలంగా దీనిపై చర్చ సాగుతూనే ఉంది. నాని -దసరా, సాయి ధరమ్ తేజ్ -విరూపాక్ష, విజయ్ దేవరకొండ -ఖుషి వంటి కొన్ని తెలుగు బ్లాక్ బస్టర్లు కూడా ఉత్తరాదిలో ఆశించినంతగా వసూళ్లను సాధించలేదు. తెలుగు రాష్ట్రాల వసూళ్లతో పోలిస్తే ఏమంత పట్టించుకోదగ్గ వసూళ్లు అయితే నమోదు కాలేదు. అందుకే ఇప్పుడు ఓటీటీలతో ముప్పు ఎలా ఉంటుందో విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మునుముందు ఈ సమస్య రిపీట్ కాకుండా ఉండాలంటే, థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీల్లో విడుదలకు గ్యాప్ 8 వారాలు ఉండాలి. అలా చేస్తే హిందీలో మన సినిమాలకు విస్తారమైన మార్కెట్ కలిసొస్తుంది. కాంతార లాంటి చిన్న సినిమానే హిందీలో బోలెడంత మ్యాజిక్ చేసింది. విక్రమ్- జైలర్ కాన్వాస్ ఈ సినిమా కంటే చాలా పెద్దవి. కానీ వాటి విషయంలో ఆ మ్యాజిక్ ఎందుకని సాధ్యపడలేదు? అంటే కేవలం ఓటీటీ విడుదల నియమాన్ని ఉల్లంఘించడమేనని అర్థం చేసుకోవాలి. ఉత్తరాదిన మల్టీప్లెక్సుల ద్వారా భారీ ఆదాయాల్ని ఆర్జించే అవకాశం ఉన్నా కానీ, ఓటీటీలు దీనిని దెబ్బ కొడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఇకపైనా దక్షిణాది నుంచి చెప్పుకోదగ్గ భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో, మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన స్కంద హిందీ సహా బహుభాషల్లో దేశవ్యాప్తంగా భారీగా విడుదల కానున్నాయి. అయితే వీళ్లంతా మల్టీప్లెక్స్ అసోసియేషన్ల నియమం ప్రకారం.. ఎనిమిది వారాల ఓటీటీ విండో నియమాన్ని అనుసరిస్తున్నారా లేదా? అన్నది కీలకంగా మారింది. సమస్య ఏమిటో తెలిసినప్పుడు దానిని పరిష్కరించడం సులువు. కానీ మన నిర్మాతలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.