అమ్మ కొడుతుందని శ్రీలీల కంప్లైంట్
పదే పదే అదే పాటకు డాన్స్ చేయడం, అదే ఫోజ్ ఇవ్వడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు కనుక ఆమె తల్లి ఆ మాట చెప్పి ఉంటుందని కొందరు అంటున్నారు.
పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న ఈ అమ్మడు మొదట కన్నడ సినిమాల్లో నటించింది. అక్కడ పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ తెలుగులో మొదటి సినిమా ఫ్లాప్ అయినా తదుపరి సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ధమాకా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు సంపాదించింది. తక్కువ సమయంలోనే కోటి అంతకు మించి పారితోషికం తీసుకునే హీరోయిన్స్ జాబితాలోనూ శ్రీలీల చేరడం అందరి దృష్టిని ఆకర్షించింది.
2024 సంక్రాంతికి మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. దాంతో శ్రీలీల కాస్త డౌన్ అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె తన జోరు కంటిన్యూ చేసింది. టాలీవుడ్‌లో ఆమె సినిమాలు మరిన్ని గత ఏడాది వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ సాంగ్ తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కిస్సిక్ సాంగ్ ఆమెకు ఓవర్ నైట్‌లో పాన్ ఇండియా స్టార్‌డంను తెచ్చి పెట్టిందనే టాక్ వినిపిస్తోంది.
పుష్ప 2 సినిమా విడుదల తర్వాత ఎక్కడ చూసినా కిస్సిక్ పాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో లక్షల మంది ఆ పాటకు డాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తున్నారు. వీడియోలకు మంచి స్పందన వస్తుంది. శ్రీలీల సైతం ఎక్కడ కనిపించినా మీడియా వారు ముఖ్యంగా ఫొటోగ్రాఫర్స్ కిస్సిక్ ఫోజ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీలీల ఇప్పటికే చాలా స్టేజ్‌ల మీద కిస్సిక్ డాన్స్ చేసింది. మీడియా ముందు కూడా కిస్సిక్ ఫోజ్‌లు ఇచ్చింది. అయితే ఇటీవల ఎయిర్ పోర్ట్‌లో మాత్రం కిస్సిక్ ఫోజ్ ఇవ్వమంటే మాత్రం తాను ఆ ఫోజ్ ఇవ్వలేను. మా అమ్మ కిస్సిక్ పాటకు డాన్స్ చేస్తే కొడుతుందని ఫన్నీగా మీడియా వారికి కంప్లైంట్ ఇచ్చింది.
పదే పదే అదే పాటకు డాన్స్ చేయడం, అదే ఫోజ్ ఇవ్వడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు కనుక ఆమె తల్లి ఆ మాట చెప్పి ఉంటుందని కొందరు అంటున్నారు. ఇక మీదట కిస్సిక్ డాన్స్‌ని శ్రీలీల చేయదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శ్రీలీల ఏం చేసినా చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం ఈమె నితిన్‌తో కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదే కాకుండా విజయ్ దేవరకొండతో ఒక సినిమాను చేస్తుంది. ఆ సినిమా వచ్చే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు అఖిల్, నాగ చైతన్య, నవీన్ పొలిశెట్టిలతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఈమె పరిశీలనలో ఉంది. రాబోయే ఏడాది కాలంలో ఈమె నుంచి కనీసం అయిదు ఆరు సినిమాలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి.