శ్రీలీలకు ఇంక కష్టమేనా?
వరుస ఫ్లాపులు పడితే మాత్రం ఆఫర్స్ కు దూరమవుతారు. అందుకే స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరముంది
గ్లామర్ ఫీల్డ్ లో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. వారానికో కొత్త కథానాయిక పరిచయమయ్యే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించడం అందరికీ సాధ్యం కాదు. అందం అభినయంతో పాటుగా ఎంతో కొంత అదృష్టం కూడా తోడైతేనే అవకాశాలు అందుతాయి. ఇక్కడ సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది కనుక, మంచి హిట్లు పడితేనే కొన్నాళ్లపాటు స్టార్ గా వెలుగొందుతారు. వరుస ఫ్లాపులు పడితే మాత్రం ఆఫర్స్ కు దూరమవుతారు. అందుకే స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరముంది.
హీరోయిన్ శ్రీలీల ను తీసుకుంటే, 'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన గ్లామర్ తో డ్యాన్స్ లతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ధమాకా హిట్టయిన తర్వాత స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి క్రేజీ ఆఫర్లు అమ్మడి తలుపుతట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్సులు వచ్చాయి. దీంతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ నెలకో సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీలీల. అయితే హిట్లు కంటే ఫ్లాప్స్ ఎక్కువ పడటంతో ఆమె చూట్టూ ఒక్కసారిగా నెగెటివిటీ వచ్చి చేరింది.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్ట్రా ఆర్డినరీమ్యాన్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలు చవిచూశాయి. 'భగవంత్ కేసరి' క్రెడిట్ బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. మహేష్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' మూవీ సైతం ఈ బ్యూటీకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. దీంతో యంగ్ బ్యూటీకి టాలీవుడ్ లో ఇక కష్టమే అనే కామెంట్లు వినిపించాయి. డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ.. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలే చేస్తుండటం, కొత్త తరహా రోల్స్ లో కనిపించకపోవడంతో ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాధించగలదా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేశారు.
శ్రీలీల అటు కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి హీరోయిన్ల మాదిరిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం లేదని.. ఇటు బాలీవుడ్ హీరోయిన్స్ వలే గ్లామరస్ క్యారక్టర్స్ లో అంత పర్ఫెక్ట్ సూట్ అవ్వడం లేదనే ఫీలింగ్ లో తెలుగు ఆడియన్స్ ఉన్నారనే మాట కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపించింది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీలీల ఇప్పుడు స్క్రిప్ట్స్ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఏది పడితే అది సైన్ చేయకుండా.. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా రిజెక్ట్ చేసినట్లుగా టాక్.
'గుంటూరు కారం' తర్వాత గ్యాప్ తీసుకున్న శ్రీలీల.. ప్రస్తుతం నితిన్ కు జోడీగా 'రాబిన్ హుడ్' సినిమా చేస్తోంది. అలానే రవితేజ, భాను భోగవరపు కాంబోలో తెరకెక్కనున్న 'RT 75' మూవీలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాజెక్ట్ కూడా శ్రీలీల చేతిలోనే ఉంది. జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు, భాగ్యశ్రీ బోర్సే లాంటి కొత్త అందాలు క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న సమయంలో.. సౌత్ లో శ్రీలీల కెరీర్ ఎలా సాగుతుందో వేచి చూడాలి.