శ్రీదేవి జయంతి స్పెషల్: ఇంద్రుని పుత్రిక ఎప్పటికీ హృదయాల్లో
దశాబ్ధాల పాటు తనదైన అద్భుత నటన, అభినయంతో మెప్పించిన క్లాసిక్ డే నటి శ్రీదేవి.
దశాబ్ధాల పాటు తనదైన అద్భుత నటన, అభినయంతో మెప్పించిన క్లాసిక్ డే నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఎప్పటికీ మనసుల్లో కొలువుదీరిన మేటి కథానాయిక. ఆ అద్భుత నటన.. మహదాద్భుతమైన హావభావాలు కళ్ల ముందు ఎప్పటికీ మెదులుతూ ఉంటాయి. ఆమె లేదు అన్న మాట ఎప్పటికి జీర్ణం కానిది. భూలోకానికి దిగి వచ్చిన ఇంద్రజ వెళ్లిపోయింది అన్న సంగతే ఇంకా ఎవరికి గుర్తు లేదు. కానీ మామ్ శ్రీదేవి దివికేగిందన్నది అంగీకరించాల్సిన నిజం.
ఎక్కడో స్వర్గలోకంలో దేవేంద్రుని కుమార్తె పూలవనంలో విహరిస్తూ సేద తీరుతోంది. అక్కడి నుంచే భూలోకంలో ఏం జరుగుతోందో పరిశీలిస్తోంది. తన కళ్ల ముందే కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కథానాయికలుగా ఎదుగుతున్నారు. పైనుంచి అమ్మ దీవెనలు అందుతున్నాయి వీళ్లకు. శ్రీదేవి తిరిగి భువిపై జన్మించే వీలుందా? మరోసారి అతిలోక సుందరిని వీక్షించే ఛాన్సుందా? అంటే నటవారసులే దీనికి సమాధానం ఇవ్వాలి. ప్రస్తుతానికి అభిమానులు పెద్ద కుమార్తె జాన్వీలోనే శ్రీదేవిని చూసుకుంటున్నారు.
నేటి తరం నటీమణుల్లో దాగి ఉన్న ప్రతిభ.. కళాత్మకత రూపంలో శ్రీదేవి జీవించే ఉందని అభిమానులు సర్ధి చెప్పుకుంటున్నారు. `దేవర` సినిమా నుంచి ఎలాంటి గ్లింప్స్ విడుదలైనా కానీ జాన్వీ లో శ్రీదేవి పోలికలు చూస్తేనే ఉన్నారు. మామ్ శ్రీదేవి లేని ఈ లోకంలో కొంత వరకూ అయినా జాన్వీ ఆ లోటును పూడ్చాలని అభిమానులు అడుగుతున్నారు. ఆర్జీవీ లాంటి వీరాభిమానులు అయితే మందు గ్లాసులో వోడ్కా ఒంపుకుని ఇంకా శ్రీదేవి కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్‌లతో ఆరంగేట్రం చేస్తున్న జాన్వీ తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుందనే భావిద్దాం.
శ్రీదేవి ప్రతి జయంతి వర్ధంతి నాడు తనకోసం ప్రత్యేకించి సంస్మరణలు చేస్తూ తన సినిమాల్ని టీవీల్లో చూస్తూ గడిపేస్తున్నారు ఫ్యాన్స్. ఎందరో నటీమణుల్లో స్ఫూర్తి నింపిన అతిలోక సుందరి శ్రీదేవి జయంతి నేడు. ఈ సందర్భంగా ఒక అభిమాని నుంచి ఈ ప్రత్యేక కథనం....