టాలీవుడ్‌లో నెం.1 హీరో ఎవరంటే..?
టాలీవుడ్ లో నెం.1 హీరో ఎవరనే దానిపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి.
టాలీవుడ్ లో నెం.1 హీరో ఎవరనే దానిపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో థియేటర్లలో ఏయే హీరోల సినిమాలు ఎక్కువ రోజులు ఆడుతున్నాయి, ఎన్ని కేంద్రాలలో వంద రోజులు పడుతున్నాయి అనేది పరిగణనలోకి తీసుకుని టాప్ హీరో ఎవరనేది డిసైడ్ చేసేవారు. ఆ తర్వాత రోజుల్లో సినిమా విజయాలు, స్టార్ డమ్, మార్కెట్ లెక్కలు, బాక్సాఫీస్ స్టామినా వంటివి ప్రామాణికంగా తీసుకొని.. ఎవరు అగ్రస్థానంలో ఉన్నారనేది నిర్ణయించారు. ఇప్పుడు మాత్రం కేవలం ఆయా సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లనే లెక్కలోకి తీసుకొని హీరోల పొజిషన్స్ ను డిసైడ్ చేసే పరిస్థితి వచ్చింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలను తీసుకుంటే.. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ సూపర్ స్టార్స్ గా వెలుగొందారు. తెలుగు సినిమాకి రెండు కళ్ళుగా నిలిచారు. కాకపోతే ఎన్టీఆర్ చేసిన సినిమాల కారణంగా, ఆయనకు ఏఎన్నార్ కంటే మాస్ అప్పీల్ కాస్త ఎక్కువ వచ్చింది. ఇదే ఆయన్ను అగ్ర స్థానంలో నిలిపింది. వీరి తర్వాత కృష్ణ ఘట్టమనేని, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇండస్ట్రీలో హవా కొనసాగించారు. వీళ్లలో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువున్న కృష్ణ సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు.
పాత తరం హీరోలలో నెంబర్ వన్ ఎవరనేది పక్కన పెడితే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులు టాలీవుడ్ కు మెయిన్ పిల్లర్స్ లా నిలిచారు. తమ చిత్రాలతో పరిశ్రమ అభివృద్ధికి పాటుపడ్డారు. తద్వారా తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలను లిఖించుకున్నారు. తెలుగు సినిమా గురించి చెప్పాల్సి వస్తే, కచ్చితంగా ఈ ఐదుగురు హీరోల గురించి చెప్పుకొని తీరాలి.
ఇక నెక్స్ట్ జనరేషన్ హీరోలలో చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ లు ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా నిలిచారు. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడానికి తమవంతు కృషి చేశారు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో సత్తా చాటారు. అయితే వీరిలో చిరంజీవి మిగతా ముగ్గురి కంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ తెచ్చుకొని, మెగా స్టార్ గా నెం.1 స్థానానికి చేరుకున్నారు. అయితే ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలు అప్పటి తరం ఆడియన్స్ ను అలరించడమే కాదు, ఇప్పటికీ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుండటం విశేషం.
తర్వాతి జనరేషన్ లో వచ్చిన హీరోలలో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లు కొన్నేళ్ళ పాటు తమ ఆధిపత్యం చూపించారు. అప్పుడు కూడా చిరంజీవి వీళ్ళకు గట్టి పోటీనిస్తూ తన అగ్ర స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ప్రస్తుతానికైతే మహేష్, పవన్ లతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లను స్టార్ హీరోలుగా పరిగణిస్తున్నారు. వీరంతా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించడమే కాదు, పాన్ ఇండియా స్టార్ డమ్ ను అందుకున్నారు. కాకపోతే వీరిలో అగ్ర స్థానం ఎవరికి అని అడిగితే చెప్పడం కష్టం.
ఎందుకంటే ఈరోజుల్లో హీరోల నెం.1 పొజిషన్ అనేది బాక్సాఫీస్ వద్ద ఆయా సినిమాలు వసూలు చేసే కలెక్షన్లను బట్టే నిర్ణయించబడుతోంది. ఒకరు 500 కోట్లు వసూలు చేస్తే, మరొకరు 1000 కోట్లు కొడుతున్నారు, ఇంకొకరు 1500 కోట్లు అంటున్నారు. అందుకే ఎవరి స్థానం కూడా శాశ్వితంగా ఉండటం లేదు. స్టార్ హీరో సినిమా అవ్వొచ్చు, లేదా చిన్న మీడియం రేంజ్ హీరో నటించిన సినిమా కూడా అవ్వొచ్చు.. ఏదైనా సరే థియేటర్లలో సాధించే వసూళ్లను బట్టే టాప్ ర్యాంక్ డిసైడ్ అవుతుంది.
పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా, ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు ఆ హీరో టాప్ పొజిషన్ లోకి వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకో హీరో ఎవరైనా ఆ రికార్డును బ్రేక్ చేస్తే, అతను అగ్ర స్థానానికి చేరుకుంటాడు. ఇదంతా నిరంతర ప్రక్రియలా జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుంటే, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం మనం చూస్తున్నాం. కథ బాగుంటే 10 కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. అదే సమయంలో 100 కోట్లు పెట్టిన సినిమాలు 10 కోట్లు కూడా రికవరీ చేయలేకపోతున్నాయి.
కాబట్టి ఇక్కడ ఎవరి పొజిషన్ కూడా పర్మినెంట్ గా ఉండటం లేదు. సినిమా సినిమాకీ హీరోల స్థానాలు మారుతూ వస్తున్నాయి. హిట్టు కొట్టినప్పుడు టాప్ లో ఉంటున్నారు, ఫ్లాప్ అందుకున్నప్పుడు కింద పడిపోతున్నాడు. అందుకే ఇక్కడ నెం.1 సూపర్ స్టార్ ఎవరనేది మనం చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. కాకపోతే రీసెంట్ గా వచ్చిన సినిమాలలో ఏ హీరో అయితే బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడతాడో, ఆ హీరోనే నెం.1 అని అనుకోవచ్చు. కానీ అది కూడా ఇంకో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే వరకే ఉంటుంది. ఓవరాల్ గా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత హీరోల స్టార్ డమ్ కంటే, కంటెంట్ & కలెక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. అవే హీరోల పొజిషన్ ను డిసైడ్ చేస్తున్నాయని చెప్పాలి.