స్టార్ హీరోలపై బడా నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు
బాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు సైతం కోరుతోన్నహీరోలెంతో మంది. సొంత బ్యానర్లో సినిమాలైతే నేరుగా లాభాలే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ బయట బ్యానర్ల చిత్రాల్లో మాత్రం వాటా ప్రాతిపదికన కొంత మంది హీరోలు సినిమాలు చేస్తే ..మరికొంత మంది పారితోషికంతో పాటు వాటాలో లాభం తీసుకుంటారు.
ఇది బాలీవుడ్ లో ఎప్పటి నుంచో అమలులో ఉంది. హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా కొంతమంది హీరోలు వాటలు తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరోల్ని ఉద్దేశించి అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 35 కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు కొంత మంది చిత్రాలు కనీసం 3.5 కోట్లు ఓపెనింగ్ కూడా తీసుకురాలేదన్నారు.
పరిశ్రమలో ఓ పది మంది స్టార్స్ భారీగా పారితోషికం తీసుకుని నిర్మాతలకు భారమవుతున్నారన్నారు. `నటులకు, మేకింగ్ మార్కెట్ కోసం మీరే డబ్బు చెల్లించాలి. సినిమా హిట్ అవ్వకపోతే నష్టపోయేది కూడా మీరే` అని చిన్న నిర్మాతలకు అండగా నిలచేలా వ్యాఖ్యానించారు. అయితే కరణ్ జోహార్ కొంత మంది హీరోల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
అక్షయ్ కుమార్ ఏడాదికి ఆరేడు సినిమాలైనా చేస్తుంటారు. కానీ ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు రాని సందర్భాలెన్నో. ఇటీవలే జాకీ భగ్నానీ భారీ బడ్జెట్ తో నిర్మించిన `బడేమియాన్ చోటే మియాన్` సినిమా ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి నష్టాలు రావడంతో తన కార్యాలయాన్ని సైతం అమ్మాల్సి వచ్చింది. ఇందులో హీరోలుగా నటించింది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాప్. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 100 కోట్లు మాత్రమే రాబట్టింది.