దొర‌క‌నంత వ‌ర‌కే దొర‌..దొరికితే ఇలాగే ఉంటుంది!

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ని పైర‌సీ భూతం ఎలా ప‌ట్టిపీడిస్తుందో చూస్తేనే ఉన్నాం.

Update: 2023-09-04 06:22 GMT

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ని పైర‌సీ భూతం ఎలా ప‌ట్టిపీడిస్తుందో చూస్తేనే ఉన్నాం. ఎన్ని క‌ఠిన అంక్ష‌లు తీసుకొచ్చినా పైర‌సీ మాత్రం య‌ధేశ్చ‌గా జ‌రుగుతూనే ఉంది. ద‌శాబ్ధాలుగా నిర్మాత‌ల్ని వేదిస్తోన్న ఓ మ‌హ‌మ్మారి ఇది. ఈ మ‌ధ్య‌నే కేంద్ర ప్ర‌భుత్వం సినిమాటోగ్ర‌ఫీ యాక్ట్ లో భాగంగా కొన్ని సంచ‌ల‌న స‌వ‌ర‌ణ‌లు తెర‌పైకి తెచ్చింది. అలాగని పైర‌సీ ఆగుతుంద‌నుకుంటే పొర‌బ‌ట్టే.

చ‌ట్టం ప‌ని చ‌ట్టానిదే..మా ప‌ని మాదే అన్న‌ట్లు పైర‌సీ జ‌రుగుతూనే ఉంది. అయితే ఎవ‌రైనా దొర‌క‌నంత వ‌ర‌కే దొర‌. దొరికిన త‌ర్వాత మాత్రం సీన్ వేరేలా ఉంటుంది. తాజాగా స్టార్ మా నెట్ వ‌ర్క్ ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని కొన్ని వెబ్ సైట్ల‌పై శ‌మ‌ర శంఖ‌రం పూరించింది. ఆ మ‌ధ్య రిలీజ్ అయిన `బ్ర‌హ్మ‌స్త్ర` రైట్స్ స్టార్ మాకి చెందిన‌వే. అయితే కొన్ని వెబ్ సైట్లు ఈ సినిమాని చ‌ట్ట‌విరుద్దంగా ప్ర‌ద‌ర్శించ‌డంతో వాటిపై దృష్టి పెట్టిన `మా` అధార‌ల‌తో ప‌ట్టుబ‌డేలా చేసింది.

సాక్షాలు ప‌రిశీలించిన న్యాయ‌స్థానం 18 సైట్ల‌పై కొర‌డా ఝుళిపించింది. 20 ల‌క్ష‌లు చొప్పున జ‌రిమానా విధిస్తూ న్యాస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఆ దొంగ‌లంతా ఇప్పుడు బ‌ట్ట‌బ‌య‌ల‌య్యారు. వాళ్ల‌ను ఆధారంగా చేసుకుని మ‌రింత మందిని వెలికి తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ 18 సైట్లే కాకుండా ఇంకా మ‌రికొన్ని వెబ్ సైట్ల పై కూడా మా కేసులు వేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలో స్టార్ మా నెట్ వ‌ర్క్ ఒక్క‌టే సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటే స‌రిపోదు.

మిగ‌తా డిజిట‌ల్ మాధ్య‌మాలు...ఛాన‌ల్స్ కూడా ముందుకొచ్చి త‌మ సినిమాని ఏఏ వెబ్ సైట్లు లీకు చేస్తున్నాయో గుర్తించి ఆధారాల‌తో స‌హా ప‌ట్టుబ‌డ‌లే చేస్తే కొంత వ‌ర‌కూ పైర‌సీ భూతాన్ని అంతం చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇదంతా ఎవ‌రికి వారు చేయ‌డం క‌న్నా! ఓ సిండికేట్ గా ఏర్ప‌డి చేస్తే స‌మూలంగా నాశనం చేయోచ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అలాగే నిర్మాత‌లు కూడా ఈ విష‌యాన్ని అంతే సీరియ‌స్ గా తీసుకోవాలి. ఓటీటీల‌కు...శాటిలైల్స్ అమ్మేసిన త‌ర్వాత మాప‌నై పోయింద‌ని చేతులు దులుపుకోకుండా చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సంసిద్దంగా ఉండాలి.

Tags:    

Similar News