స్టార్ల ఫోటోషూట్ల వెనక అసలు గుట్టు లీక్
ఇదంతా ఒక జిమ్మిక్... అవి సహజంగా అలా కుదిరినవి కానే కాదు.. ప్రతిదీ ప్లాన్ చేసి చిత్రీకరించినవేనని ప్రియమణి అన్నారు
జిమ్ కి వెళుతూనో.. లేదా విదేశీ వెకేషన్ల కోసం విమానాశ్రయాలకు వెళుతూనో.. లేదా రెస్టారెంట్, మార్కెట్ ప్లేస్ కి వెళుతూనే కెమెరా ఫ్లాష్ లకు చిక్కుతుంటారు సెలబ్రిటీలు. అయితే ఫలానా సెలబ్రిటీ ఫలానా చోటికి వెళుతోంది! అని కెమెరామెన్లకు ఎలా తెలుస్తుంది? టైముకి చకోర పక్షుల్లా అక్కడ వాలిపోయి వారి అందమైన ఫోటోలను చిత్రీకరించేందుకు ఎలా పోటీపడగలరు? దీని వెనక ఇంకేదైనా మర్మం ఉందా? అన్నది ఆరా తీస్తే అసలు గుట్టు తెలిసింది.
ప్రతిరోజూ జిమ్‌లు, విమానాశ్రయాలు, రెస్టారెంట్ల వెలుపల నటీనటుల ఫోటోషూట్ల నుంచి పదుల సంఖ్యలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఈ ఫోటోషూట్ల సమయంలో తమకు అసలేమీ తెలియనట్టుగా నటీనటులంతా ఆశ్చర్యపోతూ కెమెరాలకు పోజులిస్తుంటారు. వాస్తవంగా సదరు నటీమణులు లేదా స్టార్లు అక్కడికి వస్తారా రారా అన్నది కెమెరామెన్లకు అంత ముందుగానే ఎలా తెలుసు? అన్నదానిపై ఇప్పుడు జాతీయ ఉత్తమ నటి ప్రియమణి పబ్లిక్ వేదికపై గుట్టు విప్పారు.
ఇదంతా ఒక జిమ్మిక్... అవి సహజంగా అలా కుదిరినవి కానే కాదు.. ప్రతిదీ ప్లాన్ చేసి చిత్రీకరించినవేనని ప్రియమణి అన్నారు. తమ ఫోటోలు తీసేందుకు నటీనటులు సదరు ఫోటోగ్రాఫర్లకు డబ్బు చెల్లించాలని, వారు సందర్శించే ప్రదేశాలు ఏవి అనేది ముందుగానే ఫోటోగ్రాఫర్లకు మెసేజ్ చేస్తారని కూడా తనకు తెలిసినట్టు ప్రియమణి అన్నారు. డబ్బు చెల్లిస్తారు గనుకే ఫోటోగ్రాఫర్లు వెంటపడుతుంటారు.. కానీ అదంతా సహజసిద్ధంగా సాధ్యమైనది కానే కాదని కూడా ప్రియమణి స్పష్ఠంగా వెల్లడించారు. తనకు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసిందని కూడా తెలిపారు.
దీనిని బట్టి నేటితరం యువకథానాయికల నుంచి పరిశ్రమలో క్రేజ్ కావాలనుకున్న ఔత్సాహిక తారలంతా ఇదే తీరుగా పెద్ద మొత్తంలో ఫోటోగ్రాఫర్లకు డబ్బు చెల్లిస్తూ తమ ఫోటోషూట్లను చేయించుకుంటారని అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో ఈ సంస్కృతి విస్త్రతంగా ఉంది. దీనిని తెలుగు సినీపరిశ్రమలోను ఫాలో చేస్తున్నారా లేదా? అన్నది మన ఫోటోగ్రాఫర్లే వెల్లడించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రియమణి వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ విషయం తెలిసాక తెలుగు అభిమానులంతా షాక్ కి గురవుతున్నారు. బాలీవుడ్ స్టార్ల ఫోటోషూట్ల వెనక ఇంత కథ దాగి ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు స్టార్లకు ఫోటో ఫాంటసీ అవసరం ఏమిటి? అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫాంటసీల వెనక అసలు రంగు బయటపడిందంటూ కామెంట్లు చేస్తున్నారు.